Uttar Pradesh: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఉన్నావోలో క‌నిపించ‌కుండా పోయిన 22 ఏండ్ల ద‌ళిత యువ‌తి మృత‌దేహాన్ని పోలీసులు వెలికి తీశారు. స‌మాజ్ వాదీ నేత‌, మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్ కు చెందిన ఆశ్ర‌మం స‌మీపంలో యువ‌తి మృత‌దేహాన్ని పోలీసులు వెలికితీసి.. పోస్టుమార్టంకు పంపారు.  

Uttar Pradesh: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మ‌హిళ‌ల‌పై నేరాలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గ‌త కొంత కాలంగా రాష్ట్రంలో నేరాలు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే రెండు నెల‌ల క్రితం ఉన్నావోలో 22 సంవ‌త్స‌రాల ఓ ద‌ళిత యువ‌తి క‌నిపించ‌కుండా పోయింది. అయితే, త‌మ కుమార్తెను స‌మాజ్ వాదీ నేత‌, మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్ కు బ‌ల‌వంతంగా తీసుకెళ్లాడ‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు నిందితుడికి చెందిన ఆశ్ర‌మం స‌మీపంలోని క‌నిపించ‌కుండా పోయిన యువ‌తి మృత దేహాన్ని వెలికితీశారు. యువ‌తి మృత దేహాన్ని పాతిపెట్టిన స్థ‌లం నిందితుడికి చెందిన‌ద‌ని స‌మాచారం. దీనిపై పోలీసులు ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. భూమిలో పాతిపెట్టిన యువ‌తి మృత దేహాన్ని బ‌య‌ట‌కు తీసిన పోలీసులు.. పోస్టుమార్టం కోసం పంపారు. 

కాగా, ద‌ళిత యువ‌తి క‌నిపించ‌కుండా పోయిన ఘ‌ట‌న‌కు సంబంధించి ద‌ర్యాప్తు విష‌యంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మొద‌టి నుంచి ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా కావాల‌నే స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు ద‌ర్యాప్తును ముందుకు సాగించ‌కుండా.. నిందితుల‌కు స‌హ‌క‌రిస్తున్నార‌ని బాధిత కుటుంబం ఆరోపిస్తున్న‌ది. ఈ క్ర‌మంలోనే విచార‌ణ‌లో అలసత్వం వహించినందుకు ఆ ప్రాంతానికి చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)ను ఉన్న‌తాధికారులు సస్పెండ్ కూడా చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు వెల్ల‌డించిన మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి.. క‌నిపించ‌కుండా పోయిన ద‌ళిత యువ‌తిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై స‌మాజ్ వాదీ పార్టీ నేత‌, మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్‌ను జనవరి 24న పోలీసులు అరెస్టు చేశారు.

ఉన్నావ్‌లోని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి శేఖర్ సింగ్ మాట్లాడుతూ.. "డిసెంబర్ 8న, యువ‌తి మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం జనవరి 10న ఎఫ్‌ఐఆర్ నమోదుచేశాం. ద‌ర్యాప్తులో భాగంగా నిందితులుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఒక‌రిని అరెస్టు చేశాము. ఈ కేసుకు సంబంధించిన ద‌ర్యాప్తు పురోగతిలో ఉంది. దీని ఆధారంగా దర్యాప్తు ఫలితాలు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాము. మేము పోస్ట్‌మార్టం కోసం మృత దేహాన్ని పంపాము. రిపోర్టు వ‌చ్చిన త‌ర్వాత మ‌రింత లోతుగా విచార‌ణ జ‌రిపి.. తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాము" అని వెల్ల‌డించారు. 

కాగా, త‌మ కుమార్తె క‌నిపించ‌కుండా పోయింద‌ని స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ.. పెద్ద‌గా స్పందించ‌లేద‌ని బాధిత కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక SHO అఖిలేష్ చంద్ర పాండే నిర్లక్ష్యంగా వ్యవహరించారని మృతురాలి తల్లి ఆరోపించింది. ఈ నేప‌థ్యంలోనే జనవరి 25న లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వాహనం ముందు మహిళ తల్లి ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించింది. త‌మ‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేశారని కుటుంబీకుల ఆరోపణపై ఏఎస్పీని మీడియా ప్ర‌శ్నించ‌గా.. "ఇది పూర్తిగా నిజం కాదు. క‌నిపించ‌కుండా పోయింది యువ‌తి కావ‌డంతో మొద‌ట మిస్సింగ్ కేసు న‌మోదుచేశాం. ఈ క్ర‌మంలోనే ద‌ర్యాప్తు సాగించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టికే ఒక‌రిని అరెస్టు చేశాం. దీనిలో భాగ‌మైన మ‌రింత మంది నిందితుల కోసం వెతుకుతున్నాం" అని పేర్కొన్నారు. 

ఈ క్ర‌మంలోనే మహిళ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. "నా కుమార్తెను రాజోల్ సింగ్ అతని ఆశ్రమంలో చంపి అక్కడ పాతిపెట్టాడు, నేను ఇంతకుముందు ఆశ్రమానికి వెళ్ళాను. వారు మాకు మూడు అంతస్తుల భవనం మినహా మొత్తం ప్రాంగణం చూపించారు. త‌న కుమార్తెను తీసుకెళ్లిన విష‌యం గురించి పోలీసుల‌కు ముందుగానే చెప్పాను. అయితే, ఏ ఒక్క పోలీసు అధికారి ప‌ట్టించుకోలేదు. ఇక్క‌డికి రాలేదు. వారు వ‌చ్చివుంటే నా కుమార్తె ప్రాణాలతో ఉండేది" అని ఆవేదన వ్య‌క్తం చేశారు. రాజోల్ సింగ్, ఈ కేసులో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ డిమాండ్ చేశారు.