అతనికి కరోనా సోకింది. ఓ ప్రముఖ ఆస్పత్రి లోని ఐసోలేషన్ గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా... అక్కడి నుంచి అనుకోకుండా అతను అదృశ్యమయ్యాడు. చివరకు రైలు పట్టాలపై శవంగా కనిపించాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మలాద్ ఈస్ట్ లోని కురార్ ప్రాంతానికి చెందిన తన తాతయ్య తీవ్ర జ్వరం, కడుపునొప్పి సమస్యలతో బాధపడుతున్నారని అతని మనవడు ప్రవీణ్ రౌత్ బీజేపీ కార్పొరేటరు వినోద్ మిశ్రాకు లేఖ రాశారు.దీంతో బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు వృద్ధుడిని  ముంబైలోని రాజావాడీ ఆసుపత్రిలో చేర్చి పరీక్షించగా అతనికి కరోనా ఉందని తేలడంతో ఐసోలేషన్ గదిలో చేర్చారు. 

మంగళవారం క్వారంటైన్ లో ఉండాల్సిన కరోనా రోగి అదృశ్యమయ్యారని ఆసుపత్రి వైద్యులు కాండివలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతలో శతాబ్ది ఆసుపత్రి పక్కన రైలు పట్టాలపై ఓ వృద్ధుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు కనుగొన్నారు. అతని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా, తమ ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా రోగి మృతదేహంగా వైద్యులు గుర్తించారు.

 ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా రోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా రైలు పట్టాలు దాటుతుండగా రైలు రావడంతో ఢీకొని మరణించాడా అనే విషయంపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా కరోనా రోగి పారిపోవడం, మృతదేహమై కనిపించిన ఘటనపై దర్యాప్తు చేయాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కిషోరి పడ్నేకర్ ఆదేశించారు.