ఇటీవలి కాలంలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు వివాదాస్పదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఈ వివాదాల కారణంగా దర్శక, నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ వెబ్‌ సిరీస్‌ మీర్జాపూర్‌ 2ను బ్యాన్‌ చేయాలని మీర్జాపూర్‌ అప్నా దల్‌ ఎంపీ అనుప్రియా పాటేల్‌ డిమాండ్‌ చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌ జాతి అసమానతలను వ్యాప్తి చేస్తోందని ఆమె ఆరోపించారు.

మీర్జాపూర్‌ను ఓ హింసాత్మక ప్రదేశంగా చూపిస్తూ దాని పేరును అప్రతిష్టపాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగీ ఆథిత్యనాథ్‌ నాయకత్వంలో మీర్జాపూర్‌ ప్రశాంతతకు కేంద్ర బిందువుగా ఉందని అన్నారు. సదరు వెబ్‌ సిరీస్‌‌పై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని అనుప్రియ కోరారు. 

కాగా, గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ మీర్జాపూర్‌. దీనికి కొనసాగింపుగా ఈ నెల 23న అమెజాన్‌ ప్రైమ్‌లో మీర్జాపూర్‌ 2 విడుదలైంది.

అలీ ఫజల్‌, పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు శర్మ, శ్వేత త్రిపాఠి, హర్షితా శేఖర్‌, అమిత్‌ సియాల్‌, విజయ్‌ వర్మ, ప్రియన్షూ పేన్యూలీ, ఇషా తల్వార్‌లు కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌కు కరణ్‌ అన్షుమన్‌, గుర్మీత్‌ సింగ్‌లు దర్శకత్వం వహించారు. ఎక్సెల్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఫర్హాన్ అక్తర్, రితేశ్‌ సిద్వానీ దీన్ని నిర్మించారు.