తాము ఎన్ని కష్టాలు పడినా... కడుపున పుట్టిన తమ బిడ్డలు మాత్రం సంతోషంగా ఉండాలని అందరు తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకోసం రాత్రి అనకా.. పగలు అనకా కష్టపడి బిడ్డలను పోషిస్తుంటారు. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రతి నిమిషం తపన పడుతుంటారు. అయితే... ఓ మైనర్ బాలిక విషయంలో మాత్రం అలా జరగలేదు. దగ్గరుండి తల్లిదండ్రులే బాలిక జీవితాన్ని నాశనం చేశారు. తమ కడుపు నింపుకోవడానికి బాలికను వ్యభిచార కూపంలోకి నెట్టారు. బాలిక దీని నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

ఈ దారుణ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా... ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముంబయికి చెందిన ఓ మైనర్ బాలికకు ఇష్టం లేకున్నా.. బలవంతంగా 35ఏళ్ల వ్యక్తితో పెళ్లి జరిపించారు. అక్కడ భర్త పెడుతున్న హింసను తట్టుకోలేకపోయిన ఆ బాలిక... ఇటీవల పుట్టింటికి చేరింది. ఇంటికి వచ్చిన కూతురిని ఆదరించాల్సింది పోయి చిత్ర హింసలు పెట్టారు.

తల్లిదండ్రులు, తోడబుట్టిన సోదరులు ఆమెను నానా రకాలుగా హింసించారు. కుటుంబ పోషణ కోసం వ్యభిచార కూపంలోకి దింపారు. తనకు ఇష్టం లేదని ప్రాదేయపడినా వినిపించుకోకుండా.. దారుణంగా ప్రవర్తించారు. ఈ నరకం నుంచి బయటపడిన బాలిక తాజాగా పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.