అహ్మదాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ 13 ఏళ్ల మైనర్ ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ 26 ఏళ్ల యువకుడు.ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళల, ఆడ పిల్లల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట వారిపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అహ్మదాబాద్ (Ahmedabad) లో ఓ యువకుడు 13 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌లోని నరన్‌పురా (Naranpura)కు చెందిన 26 ఏళ్ల యువకుడు 13 ఏళ్ల బాలికతో ఏడాది నుంచి స్నేహం చేస్తున్నాడు. గత కొంత కాలం నుంచి ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. ఆమెకు డబ్బు ఇస్తానని చెప్పడంతో పాటు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ మైనర్ ను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదు. ఆరు నెలల క్రితం ఆ మైనర్ ను తీసుకొని పారిపోయాడు. తరువాత బాధితురాలి తల్లిదండ్రులకు దొరికారు. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే సమాజంలో పరువు పోతుందని భావించిన ఆ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించలేదు.
మళ్లీ నిందితుడు ఆమై నేరానికి పాల్పడ్డాడు. అహ్మదాబాద్, చోటిలా (Chotila) లోని వివిధ హోటళ్ల కు ఆ మైనర్ ను తీసుకెళ్లి అత్యాచారం చేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. అయితే శుక్రవారం ఇన్‌ఫార్మర్ల సహాయంతో పోలీసులు నిందితుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. చివరకు అతడిని పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఆ మైనర్ ను వైద్య పరీక్షలకు పంపించారు. ఆమె పలుమార్లు అత్యాచారానికి గురైనట్టు నివేదికలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం కింద కేసులు నమోదు చేశారు. POCSO (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టం కింద కూడా కేసు పెట్టారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.
ఇదిలా ఉండగా.. గత నెలలో కర్నాటక రాష్ట్రంలో ఓ మైనర్ పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొలార్ జిల్లా (kolar district) బంగారుపేట తాలుకా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 15ఏళ్ల బాలిక పుట్టినరోజున తల్లిదండ్రులు కొత్తబట్టలు కొనివ్వలేదని అలిగింది. ఇదే కోపంలో వెనకా ముందు ఆలోచించకుండా ఇంట్లోంచి ఒంటరిగా బయటకువెళ్ళిపోయింది. ఇలా ఆటోలో దగ్గర్లోని బంగారుపేటకు చేరుకుంది. అయితే మైనర్ బాలిక ఒంటరిగా దిక్కుతోచని పరిస్థితిలో వుండగా గమనించిన నలుగురు దుండగుల కన్ను ఆమెపై పడింది.
ఒంటరిగా ఉన్న ఆ బాలికకు మాయమాటలు చెప్పిన ప్రవీణ్, వేణు, కాంతరాజు, ఆనంద్ కుమార్ పని ఇప్పిస్తామని తమవెంట తీసుకెళ్లారు. ఇలా బాలికను కామసముద్రం ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు సామూహిక అత్యాచారానికి (gang rape) పాల్పడ్డారు. అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడిన దుండగులు బాలికను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. స్థానికుల ఆమెను గమనించి హాస్పిటల్ జాయిన్ చేశారు. అనంతరం ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకున్న బాలిక తనపై జరిగిన అఘాయిత్యం తెలియజేసింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, వెంటనే పట్టుకొని రిమాండ్ కు తరలించారు.
