ఉద్యోగం కోసం ఢిల్లీకి వచ్చిన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు మూడు రోజుల పాటు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడి ఆమెకు నరకం చూపారు. వివరాల్లోకి వెళితే.. మేఘాలయలోని ఈస్ట్ గారో హిల్స్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక పేదరికం కారణంగా ఢిల్లీలో ఏదైనా పనిలో చేరాలని నిర్ణయించుకుంది.

దీనిలో భాగంగా అమన్ అలియాస్ అనే చోటు అనే వ్యక్తిని ఆశ్రయించడంతో అతను ఆమెను తీసుకుని జూలై 30న ఢిల్లీ తీసుకొచ్చాడు. వీరిద్దరూ ఆగస్టు 2న గురుగ్రామ్‌లోని రాజేందర్ పార్క్ ప్రాంతలో ఉన్న తన సోదరుడు లోకేశ్‌ నివసిస్తున్న ఇంటిలో బాలికను వదిలివెళ్లాడు.

మరుసటి రోజు ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గుర్తించిన లోకేశ్ అలియాస్ లంబూ బాలికపై అత్యాచారం చేశాడు. అదే రోజు సాయంత్రం ఆమెను తీసుకుని చౌమా ప్రాంతంలోని తన స్నేహితుడు రితూ ఇంటికి వచ్చాడు.

ఆగస్టు 4న లోకేశ్ ఆమెకు బలవంతంగా మద్యాన్ని తాగించి మరోసారి అత్యాచారం చేశాడు. ఆగస్టు 5న రీతూ బాలికను తీసుకుని గురుగ్రామ్ సెక్టార్ 39లో ఉన్న ప్లేస్‌మెంట్ సంస్థ కార్యాలయానికి తీసుకెళ్లాడు.

అది భూపేందర్ అనే వ్యక్తిది.. ఆమె స్థితిని చూసిన అతను ఆమెకు మద్యం తాగించి అత్యాచారం చేశాడు. అక్కడితో ఆగకుండా సాయంత్రం తన స్నేహితుడు ఓం ప్రకాశ్‌ను కార్యాలయానికి పిలిపించగా.. అతను కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అనంతరం తిరిగి రితూ ఇంటికి ఆమెను తీసుకొచ్చారు. ఆగస్టు 6న లోకేశ్ బాలికను ఢిల్లీలోని ఓ ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడ మరోవ్యక్తి ఆమెపై అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది. బాలికకు మోతాదుకు మించి మద్యాన్ని తాగించడంతో ఆమె ఇంకా మత్తులోనే ఉండటంతో మెట్లపై నుంచి జారి పడింది.

దీంతో అక్కడికి చేరుకున్న లోకేశ్ తిరిగి ఆమెను రీతూ ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో స్పృహలోకి వచ్చిన ఆమెకు రాజేంద్రపార్క్‌ ప్రాంతంలో మేఘాలయకు చెందిన సల్మాన్ సంగ్మా, గెల్సింగ్ మారక్‌‌లతో పరిచయం ఏర్పడటంతో వారికి ఫోన్ చేసి దారుణాన్ని వివరించింది.

సమాచారం అందుకున్న సల్మాన్ సంగ్మా, గెల్సింగ్ మారక్‌లు పోలీసుల సాయంతో బాలికను రక్షించి మేఘాలయ భవన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భూపేందర్, ఓమ్ ప్రకాశ్, రీతూలను పోలీసులు అరెస్ట్ చేశారు.