మైనర్ బాలికను ఇంట్లో పనికి పెట్టుకున్న ఓ జంట దారుణానికి పాల్పడింది. వేడి కత్తులు, వేడి పాన్, సిగరెట్ లతో కాలుస్తూ...చిత్రహింసలకు గురిచేశారు. 

నాగ్‌పూర్‌ : ఓ పన్నెండేళ్ల చిన్నారిని ఇంట్లో సహాయం కోసం పెట్టుకుందో జంట. చిన్నారి అన్న కనికరం లేకుండా ఆమెకు నరకం చూపించారు. ఆ 12 ఏళ్ల బాలికను వేడి పాన్, వేడి కత్తి, సిగరెట్లతో కాలుస్తూ చిత్రహింసలకు గురిచేసినట్లు పోలీసులు తెలిపారు. అంతకంటే దారుణం.. ఈ జంట బెంగళూరుకు వెళ్లినప్పుడు నాలుగు రోజులు ఇంట్లో ఒంటరిగా వదిలివేసి, తాళం వేసుకుని వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

నాగ్‌పూర్‌లోని అథర్వ నగరి సొసైటీలోని ఈ దంపతులు.. తమ ఇంట్లో ఇంటి పనులు చేసేందుకు బెంగళూరు నుంచి బాధిత బాలికను మూడేళ్ల క్రితం తీసుకొచ్చారు. ఎన్జీవో వర్కర్ శీతల్ పాటిల్ ప్రకారం, అమ్మాయి తప్పులు చేస్తే యజమానులు వేడి పాన్ లేదా సిగరెట్‌తో ఆమెను కాల్చేవారు. 

అమెజాన్ మేనేజర్ హత్య కేసులో మరో 2 మంది అరెస్ట్, ఐదవ నిందితుడికోసం గాలింపు....

నిందితులైన దంపతులు బెంగళూరులో ఉన్న సమయంలో నాగ్ పూర్ లోని ఇంట్లో కరెంటు పోయింది. ఇదే ఆ బాలికను రక్షించిందని చెప్పొచ్చు. కరెంట్ పోవడంతో ఆమె కిటికీ నుండి సహాయం కోసం అరిచింది. అది విన్న ఇరుగుపొరుగు వారు అప్రమత్తం అయ్యారు. తలుపు పగలగొట్టి ఇంట్లోకి వచ్చారు. వారు లోపలికి వెళ్లే సరికి గాయపడిన స్థితిలో ఉన్న బాలికను గుర్తించింది.

ఆమె శరీరమంతా కాలిన గాయాలున్నాయి. ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించగా, చిత్రహింసలకు సంబంధించిన సంకేతాలు బయటపడ్డాయని పోలీసు అధికారి విక్రాంత్ సంగనే తెలిపారు. స్థానిక పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారం అందించారు. వారు నిందితులను అరెస్టు చేసి నాగ్‌పూర్ పోలీసులకు అప్పగించారు. ఈ జంటపై కేసు నమోదు చేయబడింది.

ఈ విషయంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులైన దంపతులు బాలికను నాగ్‌పూర్‌కు తీసుకువచ్చే సమయంలో ఆమెను చదివిస్తామని.. అన్ని రకాలుగా చక్కగా చూసుకుంటామని ఆమె తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.