తన ప్రేమను కాదన్నదని, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని మైనర్ బాలిక మీద కత్తితో దాడి చేశాడో యువకుడు. ఈ ఘటనలో బాలిక పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.
ఢిల్లీ : అమ్మాయిల మీద అత్యాచారాలు దాడుల విషయంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలో 17 ఏళ్ల అమ్మాయి మీద కత్తితో దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది. అతనితో ప్రేమను నిరాకరించడమే దీనికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ ఘటన ఆగ్నేయ ఢిల్లీలోని మోలార్ బ్యాండ్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో జరిగింది. అయితే ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే ఈ ఘటనలో ఆ యువతి మరణించలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలలోకి వెళితే… ఆదివారం నాడు పోలీసులకు మోలార్‌బ్యాండ్ ఎక్స్‌టెన్షన్‌లో ఓ యువతి మీద కత్తితో దాడి జరిగిందని పిసిఆర్ కాల్ వచ్చింది. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా రు. అయితే, అప్పటికే ఆ యువతిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత పోలీసులు అక్కడి నుంచి నేరుగా యువతిని చేర్చిన ఆసుపత్రికి వెళ్లారు.
ఫోన్ వాడనివ్వలేదని టీనేజీ బాలిక ఆత్మహత్య.. ఏడంతస్తుల భవనంపై నుంచి దూకి..
ఆ యువతిని ఎయిమ్స్ లో చేర్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు యువతికి వైద్యం అందించిన డాక్టర్లతో మాట్లాడారు. మెడికో లీగల్ రిపోర్టులో బాలిక మెడ, తల మీద కత్తి గాయాలు ఉన్నట్లు తేలింది.. అని ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆగ్నేయ) రాజేష్ డియో వివరాలు తెలిపారు. ఇక కత్తిపోట్లకి దారి తీసిన పరిస్థితుల గురించి చెబుతూ.. బాధితురాలైన 17 యేళ్ల మైనర్ గర్ల్.. ప్రిన్స్ (22) అనే వ్యక్తితో గత కొంతకాలంగా ప్రేమలో ఉంది.
ఇటీవల అమ్మాయి అతనితో ప్రేమను తెగ తెంపులు చేసుకుంది. ఇకమీదట అతనితో ఉండడం కుదరదని తెలిపింది. పెళ్లి చేసుకోవడానికి కూడా నిరాకరించింది. దీంతో కోపావేశానికి వచ్చిన ప్రిన్స్ ఆమెను చంపాలన్న ఉద్దేశంతో కత్తితో ఆమె మీద పలుసార్లు దాడికి పాల్పడ్డాడు. విచక్షణారహితంగా పొడిచాడు. విచారణలో ఈ విషయం తేలిందని పోలీసులు తెలిపారు.
దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. "భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 (హత్య ప్రయత్నం), 506 (నేరపూరిత బెదిరింపు), 452 (హింస, దాడి) కింద ప్రిన్స్‌పై కేసు నమోదైందని అధికారి చెప్పారు.
