హథ్రాస్ ఘటన మరవకముందే.. అలాంటి దారుణాలు మరిన్ని వెలుగు చూస్తున్నాయి. కోచింగ్ కోసం వెళ్లి వస్తున్న ఓ మైనర్ బాలికపై  ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని అమేథిలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అమేథికి చెందిన 11ఏళ్ల మైనర్ బాలిక ముసఫిర్కానా కొత్వాలీ ప్రాంతానికి రోజూ కోచింగ్ కోసం వెళుతుంది. నాలుగు రోజుల క్రితం కూడా బాలిక అదేవిధంగా కోచింగ్ కి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు బాలికను అడ్డగించారు. వారిలో ఒకరు బాలికకు సమీప బంధువు కావడం గమనార్హం. బాలికను అపహరించి వేరే ప్రాంతానికి తీసువకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటన అక్టోబర్ 16వ తేదీన చోటుచేసుకోగా.. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారం అనంతరం బాలికను వదిలేసి వెళ్లిపోయారు. కాగా.. ఇంటికి చేరిన బాలిక జరిగినదంతా తన తల్లిదండ్రులకు తెలియజేసింది.  కాగా.. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత బాలిక తల్లిదండ్రులు ఈ విషయమై పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

కాగా.. నిందితులను అరెస్టు చేయాల్సిందిపోయి.. పోలీసులు వారితో బేరసారాలు ఆడినట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. నిందితులను  కుర్చీలో కూర్చోపెట్టి మరీ మాట్లాడినట్లు తెలుస్తోంది. పోలీసులు అలా నిందితులకు మర్యాదలు చేస్తుండగా.. ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్త వైరల్ అవ్వడంతో విషయం సీరియస్ అయ్యింది. కాగా.. ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించి వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.