Kerala High Court: సోదరుడి వల్ల గర్భం దాల్చిన మైనర్ బాలిక ఏడు నెలల గర్భాన్ని తొలగించడానికి కేరళ హైకోర్టు అనుమతించింది. అబార్షన్ కు అనుమతించకపోతే వివిధ సామాజిక, వైద్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కోర్టు తెలిపింది.
Kerala High Court: తన సోదరుడిచే గర్భం దాల్చిన 15 ఏళ్ల బాలిక 7 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మెడికల్ బోర్డు సమర్పించిన మెడికల్ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ జియాద్ రెహమాన్ ఎఎ, గర్భం తొలగింపునకు అనుమతించకపోతే వివిధ సామాజిక, వైద్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కేరళలో సొంత సోదరుడి వల్ల ఒక మైనర్ బాలిక గర్భవతి అయింది. ప్రస్తుతం సదరు 15 ఏండ్ల బాలిక 7 నెలల గర్భిణి. అయితే, తన గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతి ఇవ్వాలన్న బాలిక విజ్ఞప్తి, కుటుంబ సభ్యుల విన్నతిని కేరళ హైకోర్టు అంగీకరించింది. మెడికల్ రిపోర్టులు ఆమోదయోగ్యంగా ఉంటే గర్భవిచ్చిత్తి చేసుకోవచ్చని తీర్పును ఇచ్చింది. మైనర్ బాలిక గర్భం తొలగించాలని ఆమె తండ్రి కోరడంతో అబార్షన్ కు అనుమతి ఇవ్వకపోతే వివిధ సామాజిక, వైద్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.
బాలికను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు సమర్పించిన నివేదిక ఆధారంగా జస్టిస్ జియాద్ రెహ్మాన్ తో కూడిన సింగిల్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. 32 వారాలకు పైగా గర్భం కొనసాగడం వల్ల బాధితురాలి సామాజిక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగే అవకాశం ఉందని తెలిపింది. సొంత తోబుట్టువు నుంచి పుట్టిన బిడ్డను పరిగణనలోకి తీసుకుంటే పలు సామాజిక, వైద్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గర్భాన్ని తొలగించడానికి పిటిషనర్ కోరిన అనుమతి అనివార్యంగా గుర్తించింది.
మెడికల్ రిపోర్టును పరిశీలించిన తర్వాత ఆ శిశువు శారీరకంగా, మానసికంగా ఫిట్ గా ఉన్నట్లు స్పష్టమవుతోందనీ, గర్భం కొనసాగడం వల్ల శిశువు సామాజిక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని తీర్పులో పేర్కొంది. ఆ బాలిక సజీవ శిశువుకు జన్మనిచ్చే అవకాశం ఉందని మెడికల్ బోర్డు తెలిపింది. కానీ దీనికి గల పరిస్థితుల్లో పిటిషనర్ కుమార్తె గర్భాన్ని మెడికల్ టర్మినేషన్ కు అనుమతించేందుకు తాము మొగ్గు చూపుతున్నట్టు న్యాయస్థానం తెలిపింది.
అందువల్ల పిటిషనర్ మైనర్ కుమార్తె గర్భాన్ని ఆలస్యం చేయకుండా వైద్యపరంగా తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రతివాదులు 4 (జిల్లా వైద్యాధికారి, మలప్పురం), 5 (సూపరింటెండెంట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, మంజేరి)లను ఆదేశిస్తున్నామని న్యాయమూర్తి మే 19న ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
