ఉత్తరప్రదేశ్‌లో ఓ మైనర్ బాలిక రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించారు. అతి కష్టం మీద చేతులు పైకి ఎత్తుతూ సహాయం కోసం అర్థించారు. కానీ, అక్కడ గుమిగూడిన వారు పోలీసులకు సమాచారం తెలిపి హాస్పిటల్ తీసుకెళ్లకుండా చేతిలోకి ఫోన్‌లు తీసుకుని వీడియోలు తీయడం మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో చూస్తే ఆపదలో ఉన్నవారికి కనీసం సహాయం చేసే గుణం మనుషుల్లో కరిగిపోతున్నదా? అనే అనుమానం కలుగకమానదు. 12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై రక్తపు మడుగులో నుంచి సహాయం కోసం బాలిక దీనంగా ఆర్తనాదాలు చేస్తుంటే.. అక్కడ గుమిగూడిన స్థానికులు ఫోన్‌లు చేత పట్టుకుని వీడియోలు తీస్తూ కనిపించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెకు సహాయం హస్తం అందించకుండా వీడియోలు తీసుకుంటూనే ఫోన్‌లకు విషయం తెలియజేశారా? అని చాలా క్యాజువల్‌గా మాట్లాడుకుంటున్న దృశ్యాలు కలవర పెడుతున్నాయి.

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అక్కడి అమానవీయ వైఖరిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ వీడియోలో బాధిత బాలిక అతికష్టం మీద చేతులు పైకి ఎత్తుతూ సహాయం కోసం వేడుకుంటున్నది. కానీ, వారు ఆమె ఆర్తనాదాలను పట్టించుకోనేలేదు. ఆ గుంపులో ఉన్నవారిలో ఒకరు పోలీసులకు ఫోన్ చేశారా? అని అడుగుతున్నారు. ఇంకొకరు పోలీసు నెంబర్ అడుగుతున్నారు. ఇవన్నీ ఫోన్‌లో వీడియోలు తీసుకుంటూనే మాట్లాడుకుంటున్నారు. చివరకు పోలీసులు అక్కడికి వచ్చే వరకు బాధిత బాలిక ఆ నరకాన్ని అనుభవించాల్సే వచ్చింది. 

Also Read: రేపిస్టు శిక్షను తగ్గించిన హైకోర్టు.. ‘ఆ బాలికను చంపేయకుండా వదిలిపెట్టే దయ ఉంది’

మరో వీడియోలో స్థానిక పోలీసు ఔట్‌పోస్టు ఇంచార్జీ ఆ బాలికను చేతుల్లో మోసుకుని ఆటోరిక్షా వైపు పరుగెడుతున్నట్టు కనిపించారు. 

Scroll to load tweet…

ఎస్పీ కున్వర్ అనుపమ్ సింగ్ మాట్లాడుతూ, ఆ మైనర్ బాలిక గాయాలతో అక్కడ కనిపించారని తెలిపారు. స్థానికులు ఆమెను పోలీసుకు తరలించారని వివరించారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. అయితే, ఆమెపై లైంగికదాడి జరిగిందా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటికీ ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.

Scroll to load tweet…

బాలిక కుటుంబ సభ్యుల ప్రకారం, ఆమె ఓ పిగ్గీ బ్యాంక్ కొనుక్కోవడానికి మధ్యాహ్నం బయటకు వచ్చిందని, ఆమె సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదని అన్నారు. దీంతో ఆమె కోసం వెతకడం మొదలు పెట్టామని చెప్పారు. గెస్ట్ హౌజ్ వెనుకాల తమ పాప రక్తపు మరకలతో కనిపించిందని చెప్పారు.

తొలుత ఆమెను జిల్లా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆమె కండీషన్ క్రిటికల్‌గా ఉండటంతో వైద్యులు కాన్పూర్‌కు రిఫర్ చేశారు. స్థానికులు మాత్రం.. ఆ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందని, ఆ తర్వాత ఆమెను అక్కడ పడేసి వెళ్లిపోయారని వివరించారు. స్థానికుల మాటలను పోలీసులు తిరస్కరించారు. ఇప్పుడే ఏమీ చెప్పలేమని, బాలిక వాంగ్మూలం కోసం వెయిట్ చేస్తున్నామని గుర్సాహైగంజ్ పోలీసు స్టేషన్ ఇంచార్జీ మనోజ్ పాండే తెలిపారు.