మధ్యప్రదేశ్‌లో ఓ మైనర్ బాలుడు గోధుమలు దొంగతనం చేశాడని చితకబాదారు. ఆ తర్వాత ఆ బాలుడికి గుండు కొట్టించారు. ఈ ఘటన గునా జిల్లా మధుసూదన్‌గడ్ వ్యవసాయ మార్కెట్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గోధుమలు దొంగిలించాడని ఓ వ్యవసాయ మార్కెట్‌లో బాలుడిని చితక బాదారు. ఆ తర్వాత గుండు కొట్టించారు. దాడి చేసిన తర్వాత ఆ బాలుడిని కొందరు పారిపోకుండా గట్టిగా పట్టుకున్నారు. తీవ్రంగా దూషిస్తూ ఆ బాలుడికి గుండు కొట్టించారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అవుతున్నది. కాగా, తాను ఆ గోధుమలు దొంగిలించలేదని, కేవలం అక్కడ స్పాటల్‌లో మాత్రమే ఉన్నానని ఆ బాలుడు పేర్కొంటున్నాడు.
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో చోటుచేసుకుంది. గునా జిల్లాలోని మధుసూధన్‌గడ్ వ్యవసాయ మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ వీడియోను పరిశీలించారు. ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 323,506 బీ, 294,324, 342, 147 సెక్షన్‌ల కింద కేసు నమోదు అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా శివరాజ్ భీల్ అనే వ్యక్తిని గుర్తించారు. కానీ, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
ఆ మైనర్ బాలుడు నిజంగానే గోధుమలు దొంగిలించాడా? లేదా? అనే విషయాన్ని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకున్నవారిని గుర్తించామని, కేసు కూడా నమోదు చేశామని వివరించారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని మధుసూదన్‌గడ్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో అనూప్ భార్గవ తెలిపారు.
ఇదిలా ఉండగా, కర్నాటక రాజధాని బెంగళూరులో 17 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ విద్యార్థి మార్చి నెలలో 23వ అంతస్తు నుంచి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన స్నేహితులకు వీడియో సందేశం పంపాడు. అందులో తనకు ఎలాంటి సమస్యలు లేవు అంటూనే.. ఆత్మహత్యే శరణ్యం అని పేర్కొనడం సంచలనంగా మారింది. వివరాల్లోకెళ్తే.. బెంగళూరులో ఆదివారం రాత్రి కోననకుంటెలోని నివాస సముదాయం 23వ అంతస్తు నుంచి ఓ మైనర్ దూకి చనిపోయాడు. అతను దూకడానికి ముందు తన స్నేహితులకు వీడియో సందేశాన్ని పంపాడు. అయితే అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో వెల్లడించలేదు.
23వ అంతస్తు నుంచి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకున్న సదరు విద్యార్థి సెకండ్ ప్రీ-యూనివర్శిటీ కోర్సు (పీయూసీ) చదువుతున్నాడు. అతనికి ఆరోగ్యం లేదా విద్యాపరమైన సమస్యలు లేవని బాలుడి తండ్రి తమకు తెలియజేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో బాలుడు తన బంధువు ఇంటి బాల్కనీకి వచ్చి దూకినట్లు సమాచారం. అతను దూకినప్పుడు అతని బంధువులు నిద్రలో ఉన్నారు. అయితే, ఆ విద్యార్థి 23వ అంతస్తు నుంచి దూకడంతో సెక్యూరిటీ గార్డులు పెద్ద చప్పుడు విని ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ సదరు విద్యార్థి విగతజీవిగా పడి ఉండటం గుర్తించారు అని పోలీసులు పేర్కొన్నారు.
