దొంగతనం చేశాడని ఓ పద్నాలుగేళ్ల బాలుడిని బట్టలూడదీసి.. తలక్రిందులుగా వేలాడదీసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనం కలిగించింది. ఫిరోజాబాద్‌కు చెందిన ఓ 14 ఏళ్ల కుర్రాడు ఓ ఇనుప పైపుల గోడౌన్‌లో పనిచేస్తున్నాడు.. ఈ నెల 24 వ తేదిన గోడౌన్‌లో కొన్ని స్టీల్ పైపులు చోరీకి గురయ్యాయి. ఇది ఈ కుర్రాడే చేశాడని భావించిన యజమాని ఆ బాలుడిని తొలుత పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు.

దొంగతనం చేసినందుకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఆ కుర్రాడిని వదిలేశారు. అయితే అప్పటికే  ఆగ్రహంతో రగిలిపోతున్న యజమాని బాలుడిని గోడౌన్‌కు తీసుకెళ్లి.. విచక్షణారహితంగా చావబాదాడు.. అనంతరం బట్టలు ఊడదీసి.. తలక్రిందులుగా వేలాడదీశాడు.. సుమారు 5 గంటల పాటు బాలుడిని అదే స్థితిలో ఉంచి.. మూడు గంటల పాటు చితకబాది అతనికి నరకం చూపాడు ఆ యజమాని..

ఈ తతంగాన్నాంతా గోడౌన్‌లోని మిగిలిన కూలీలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయ్యింది. ఇది పోలీసులదాకా వెళ్లడంతో బాలుడిని విడిపించి.. యజమానిని అదుపులోకి తీసుకున్నారు.