ఆయనపై ఇప్పటికి డజను మందికిపైగా మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. అయితే.. తనపై మొట్టమొదటగా ఆరోపణలు చేసిన జర్నలిస్టు ప్రియా రమణిపై చర్యలు తీసుకునేందుకు ఎంజే అక్బర్ సిద్ధమయ్యారు.
దేశవ్యాప్తంగా మీటూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ కూడా ఉన్నారు. ఆయనపై ఇప్పటికి డజను మందికిపైగా మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. అయితే.. తనపై మొట్టమొదటగా ఆరోపణలు చేసిన జర్నలిస్టు ప్రియా రమణిపై చర్యలు తీసుకునేందుకు ఎంజే అక్బర్ సిద్ధమయ్యారు.
జర్నలిస్టు ప్రియా రమణిపై పరువునష్టం కేసు వేశారు. ఎంజే అక్బర్ తరఫున ఆయన న్యాయవాదులు కరంజవాలా, తదితరులు పాటియాలా హౌస్ కోర్టులో సోమవారంనాడు ఈ కేసు వేశారు.
గత ఏడాది ప్రియా రమణి ఓ ఇంటర్వ్యూలో తనపై గతంలో ఓ ప్రముఖ జర్నలిస్టు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపించారు. గత వారం ఆ వ్యక్తి ఎంజే అక్బర్ అంటూ ఆమె ప్రకటించడం సంచలనమైంది. ప్రియా రమణితో పాటు మరో పది మంది వరకూ మహిళలు తమకూ ఇలాంటి అనుభవం ఎదురైనట్టు మంత్రిపై ఆరోపణలకు దిగారు. దీంతో మంత్రి రాజీనామా చేయాలంటూ విపక్షాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో విదేశాల్లో అధికార పర్యటన ముగించుకుని ఆదివారం ఢిల్లీకి వచ్చిన ఎంజే అక్బర్ తనపై వచ్చిన ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని చెప్పారు. 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఇలాంటి ఆరోపణలు చేయడం చూస్తుంటే దీని వెనుక ఏదో 'కుట్ర' కనిపిస్తోందన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వారిపై లీగల్ చర్యలు తీసుకుంటామని అన్నారు. తన లాయర్లు ఈ విషయం చూసుకుంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో తనపై మొదటిగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ప్రియా రమణిపై సోమవారంనాడు ఆయన పరువునష్టం కేసు వేశారు.
