దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరి ఘటన నేపథ్యంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షా నివాసంలో అరగంట సేపు సమావేశమయ్యారు. అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ భేటీ జరగడం గమనార్హం. తాను రాజీనామా చేయబోనని అజయ్ మిశ్రా ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి దీనిపై ఇంకా స్పందన లేదు.

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బుధవారం భేటీ అయ్యారు. కొడుకు ashish mishraపై lakhimpur kheri ఘటన కేసు నమోదైన తర్వాత తొలిసారిగా వీరి భేటీ జరిగింది. కేంద్ర మంత్రి ajay mishra నార్త్ బ్లాక్‌లోని తన ఆఫీసుకు వెళ్లారు. సుమారు అరగంటపాటు అక్కడ గడిపారు. అనంతరం amit shah నివాసానికి వెళ్లారు. వీరిరువురు సుమారు అరగంటపాటు సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ కార్లు దూసుకెళ్లిన ఘటన, రైతుల మరణాలకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి అమిత్ షాకు ఈ భేటీలో వివరించి ఉండవచ్చని భావిస్తున్నారు.

లఖింపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రైతుల మరణాలు ఆగ్రహావేశాలను రగిలించాయి. ఆ కాన్వాయ్‌లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఆయన తనయుడు అశిశ్ మిశ్రా కూడా ఉన్నారని రైతులు చెబుతున్నారు. అశిశ్ మిశ్రా ప్రయాణిస్తున్న కారు రైతులపై దూసుకెళ్లిందని ఆరోపిస్తున్నారు. అశిశ్ మిశ్రాపై మర్డర్ కేసు కూడా నమోదైంది. అజయ్ మిశ్రాను హోం శాఖ నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతులూ ఈ డిమాండ్‌ను వినిపించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి హోం మంత్రితో భేటీ కావడం చర్చనీయాంశమవుతున్నది. అయితే, తనపై, తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను అజయ్ మిశ్రా కొట్టిపారేశారు.

ఈ తరుణంలోనే హోం శాఖ నుంచి అజయ్ మిశ్రాను తొలగించే అవకాశముందా? అనే ప్రశ్నపై చర్చ తీవ్రతరమవుతున్నది. ప్రతిపక్షాల ఈ డిమాండ్‌పై ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కానీ, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా మాట్లాడుతూ, ‘నేనెందుకు resign చేయాలి. మాపై అలాంటి ఒత్తిడేమీ లేదు. ఆ ఘటనపై దర్యాప్తు చేయిస్తాం. అందులో ప్రమేయమున్నవారిపై, కుట్ర చేసినవారిపై చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.

మంగళవారం జరగాల్సిన ఓ సమావేశాన్ని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రద్దు చేసుకున్నట్టు తెలిసింది. ఆ సమావేశంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. కానీ, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మీడియా అధికారి దీనిపై మాట్లాడుతూ ఆ కార్యక్రమాన్ని నిలిపేశామని వివరించారు. కేంద్ర మంత్రికి పంపిన ఆహ్వానం రద్దు అయినట్టుగా గుర్తించాలని తెలిపారు.