Asianet News TeluguAsianet News Telugu

UP Assembly Election 2022: యూపీలో గెలిస్తే.. ఇద్దరు సీఎంలు, ముగ్గురు డిప్యూటీ సీఎంలు: అసదుద్దీన్ ఒవైసీ సంచలనం

దేశం చూపు అంతా ఉత్తరప్రదేశ్ ఎన్నికలపైనే ఉండగా.. అక్కడ మరే రాష్ట్రంలో చోటుచేసుకోని విధంగా ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. అనూహ్య రీతిలో నేతలు పార్టీ మారడం ఒకటైతే.. ఇప్పుడు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రతిపాదనలూ చర్చనీయాంశమయ్యాయి. ఈ రోజు అసదుద్దీన్ ఒవైసీ యూపీ ఎన్నికల్లో పోటీకి తమ కూటమిని ప్రకటించారు. అంతేకాదు, తమ కూటమి అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులను, ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమిస్తామని తెలిపి సంచలనం సృష్టించారు.

MIM chief asaduddin says if we came to power will appoint two cms
Author
Lucknow, First Published Jan 22, 2022, 8:15 PM IST

లక్నో: ఏఐఎంఐఎం(AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది వరకు మనం చూడని, వినని ప్రతిపాదన చేశారు. ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు(Chief Ministers) అనే అంశం ఎప్పుడూ చర్చకు రాలేదు. కానీ, అసదుద్దీన్ ఒవైసీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో తాము పోటీ చేయబోతున్న కూటమిని ప్రకటించారు. అదే సందర్భంలో యూపీ Assembly Electionsలో తమ కూటమి గెలిస్తే.. రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారని, ముగ్గురు డిప్యూటీ ముఖ్యమంత్రులు ఉంటారని వెల్లడించి సంచలనం సృష్టించారు.

ఉత్తరప్రదేశ్‌లో తాము బాబు సింగ్ కుష్వాహా, భారత్ ముక్తీ మోర్చాలతో కలిసి పోటీ చేయబోతున్నట్టు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. తమ కూటమి అధికారంలోకి వస్తే ఇద్దరు ముఖ్యమంత్రులను నియమిస్తామని ప్రతిపాదించారు. ఇందులో ఒకరు ఓబీసీ కమ్యూనిటీ నుంచి మరొకరు దళిత సామాజిక వర్గం నుంచి ఉంటారని చెప్పారు. అంతేకాదు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమిస్తామని ప్రకటించారు. అందులో ఒకరు ముస్లిం కమ్యూనిటీకి చెందినవారు ఉంటారని తెలిపారు. ఈ కూటమిపై విలేకరులు ఓ కీలక ప్రశ్న వేశారు. ఈ కూటమి తప్పక చేపట్టాల్సి వచ్చిందా? అని అడిగారు.  దీనికి బాబు సింగ్ కుష్వాహా సమాధానం ఇచ్చారు. ఇది తప్పక ఏర్పడాల్సిన కూటమి కాదని వివరించారు. తాము దళితుల కోసం, వెనుకబడినవారి కోసం, మైనార్టీ సమాజం కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్నామని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ కూటమి ఏర్పడిందని వివరించారు.

ఇదిలా ఉండగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం పోల్ ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధాన్ని ఎన్నికల సంఘం ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ నెల 31వ తేదీ వరకు ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం కొనసాగుతుంది. అయితే, తొలి రెండు విడతల్లో జరిగే ఎన్నికలకు మాత్రం కొన్ని సడలింపులను ఇచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఎన్నికల సంఘం ఎన్నికల ర్యాలీలపై విధించిన నిషేధంపై నిర్ణయం తీసుకోవడానికి సమావేశాన్ని నిర్వహించింది.

తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 10వ తేదీ, రెండో విడత ఫిబ్రవరి 14వ తేదీన జరగనున్నాయి. ఈ రెండు ఎన్నికల విడతల కోసం ఎన్నికల సంఘ ఈ నిషేధం నుంచి సడలింపులను ఇచ్చింది. తొలి విడత ఎన్నికల కోసం జనవరి 28వ తేదీ నుంచి, రెండో విడత ఎన్నికల కోసం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ సడలింపులు అమల్లోకి రానున్నాయి. తొలి విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు జనవరి 28వ తేదీ నుంచి పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు. రెండో విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పిబ్రవరి 1వ తేదీ నుంచి పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు. 

తొలి విడతలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా జనవరి 27వ తేదీన ఖరారవుతుంది. కాబట్టి, వీరికి పబ్లిక్ మీటింగ్స్‌కు 28వ తేదీ నుంచి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మీటింగులు కూడా నిర్దేశిత బహిరంగ ప్రదేశాల్లో గరిష్టంగా 500 మందితో నిర్వహించుకోవచ్చు. లేదా ఆ గ్రౌండ్ కెపాసిటీలో 50 శాతం మందితో నిర్వహించుకోవచ్చు. లేదా ఆ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిర్దేశించిన మందితో జరుపుకోవాలి. ఇందులో ఏది కనిష్టమైతే.. అదే అమలు అవుతుంది. ఈ మీటింగులు జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు నిర్వహించుకోవచ్చు. కాగా, రెండో విడత కోసం అభ్యర్థులు ఈ నెల 31వ తేదీన ఖరారు అవుతారు. వారు ప్రచారం చేసుకోవడానికి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అనుమతనిచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios