ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ అత్యంత వేగంగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇండియా కంటే ముందే వ్యాక్సినేషన్‌‌ ప్రారంభమైన అమెరికా, బ్రిటన్‌ దేశాలతో పోలిస్తే మనదేశంలో అతి తక్కువ సమయంలోనే 10 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు తెలిపింది.

కేవలం ఆరు రోజుల్లోనే పది లక్షల మందికి టీకా అందించామని.. ఆదివారం నాటికి ఈ సంఖ్య 16 లక్షలకు చేరుకుందని ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే, 10 లక్షల మందికి టీకా ఇవ్వడానికి బ్రిటన్‌కు 18 రోజుల సమయం పట్టగా, అమెరికాకు పదిరోజుల సమయం పట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Also Read:కరోనా వింత : మహిళకు ఐదు నెల్లలో, 31 సార్లు పాజిటివ్‌.. !

గడిచిన 24 గంటల్లో 2 లక్షల మందికి టీకా‌ ఇవ్వగా, జనవరి 24 నాటికి దాదాపు 16 లక్షలు (15,82,201) మందికి వ్యాక్సిన్‌ తొలి డోసు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లపై వచ్చే వదంతులను నమ్మవద్దని, మీ సమయం వచ్చినప్పుడు టీకా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు.  

ఇప్పటి వరకు దాదాపు 56 దేశాల్లో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమవ్వగా, ఇప్పటికే 6 కోట్ల 30 లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రతినిత్యం సరాసరి 30 లక్షల మందికి వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. ఇక అమెరికాలో ఇప్పటి వరకు అత్యధికంగా 2 కోట్ల 10 లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించారు. అక్కడ ప్రతిరోజు పది లక్షల టీకా డోసులను పంపిణీ చేస్తున్నారు.