జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదులకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు పోలీసులు వెల్లడించారు. మెడికో లీగల్ పరీక్షల్లో భాగంగా చనిపోయిన ఉగ్రవాదులకు శ్రీనగర్‌లోని సీడీ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టంతో పాటు డీఎన్ఏ, కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.

దీనిలో ఉగ్రవాదులిద్దరికీ వైరస్ సోకినట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు. కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా వీరికి బారాముల్లాలో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. జమ్మూకాశ్మీర్ కుల్గాం జిల్లాలోని ఆర్రా ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

దీంతో అప్రమత్తమైన భారత సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రవాదులు మరణించిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే, జమ్మూకాశ్మీర్‌లో గడిచిన ఆరు నెలల్లో దాదాపు 118 ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. వీరిలో 107 మంది స్థానిక ఉగ్రవాదులు కాగా, మరో 11 మంది పాకిస్తానీలు ఉన్నారు.