Milad-un-Nabi: పౌరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు.. మిలాద్-ఉన్-నబీ వివరాలు ఇవిగో..
Milad-un-Nabi: గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈద్ మిలాద్-ఉన్-నబీ అక్టోబర్ 8 సాయంత్రం ప్రారంభమై.. అక్టోబర్ 9 సాయంత్రం ముగుస్తుంది. దీనిని ఈద్-ఎ-మిలాద్ లేదా మౌలిద్ అని కూడా పిలుస్తారు. ప్రవక్త ముహమ్మద్ జన్మదినం నేపథ్యంలో దీనిని జరుపుకుంటారు.
President Droupadi Murmu: ముహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే ఈద్ మిలాద్-ఉన్-నబీ లేదా మిలాద్-ఉన్-నబీ సందర్భంగా తోటి పౌరులందరికీ, ముఖ్యంగా మన ముస్లిం సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని రాష్ట్రపతి ముర్ము తన సందేశం పంపారు. మహ్మద్ ప్రవక్త దయ, సరళత, మానవాళికి సేవ చేసే సందేశాన్ని ప్రపంచానికి అందించారని రాష్ట్రపతి అన్నారు.
"ఆయన (మహ్మద్ ప్రవక్త) సందేశం మనలో ప్రతి ఒక్కరినీ సామరస్యం, సౌభ్రాతృత్వ మార్గంలో ముందుకు సాగేలా ప్రేరేపిస్తుంది. హజ్రత్ ముహమ్మద్ జీవితం నుండి మనం స్ఫూర్తి పొంది.. పరస్పర సామరస్యంతో జీవించడం ద్వారా మన దేశ ప్రగతికి పాటుపడతామని ప్రతిజ్ఞ చేద్దాం" అని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటనలో ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
కాగా, ఈద్ మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్ ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఇస్లామిక్ క్యాలెండర్‌లో మూడవ నెల అయిన రబిఅల్-అవ్వాల్‌లో జరుపుకుంటారు. ఈద్-ఎ-మిలాద్ లేదా మవ్లీద్ అని కూడా పిలుస్తారు. ఇస్లాం స్థాపకుడు, ముస్లింలు దేవుని దూతగా విశ్వసించే ప్రవక్త ముహమ్మద్ జన్మదినం నేపథ్యంలో దీనిని జరుపుకుంటారు. ఇస్లాం పవిత్ర గ్రంథం ఈ ఆయన జన్మదిన సందర్భంగా జరుపుకునే వేడుకగా పేర్కొంటోంది. ప్రవక్త ముహమ్మద్ క్రీ.శ.570లో మక్కాలో జన్మించి క్రీ.శ.632లో మదీనాలో మరణించారు. ఈ పండుగను షియా, సున్నీ వర్గాలు వేర్వేరు రోజులలో జరుపుకుంటారు. ఇస్లామిక్ నెల రబీ అల్-అవ్వల్ 12వ తేదీన సున్నీ ముస్లింలు దీనిని పాటిస్తే, షియా ముస్లింలు రబీ అల్-అవ్వల్ 17వ తేదీన పాటిస్తారు. ఈద్-ఎ-మిలాద్ ప్రవక్త వర్ధంతి అని కూడా నమ్ముతారు. కొంతమంది ముస్లింలు ఆయనకు సంతాపం తెలుపుతారు.
భారతదేశంలో ఈద్ మిలాద్-ఉన్-నబీ.. ప్రాముఖ్యత
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం, ఈద్ మిలాద్-ఉన్-నబీ అక్టోబర్ 8 సాయంత్రం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 9 సాయంత్రం ముగుస్తుంది. ఈద్ మిలాద్-ఉన్-నబీ రోజున, ముస్లింలు ముహమ్మద్ ప్రవక్త జీవితం, ఆయన బోధనలను గుర్తుంచుకుంటారు. ఖురాన్ పఠనంతో పాటు దానిని చదవిస్తూ.. పేదలకు ఆహారం, బట్టలు దానం చేస్తారు. ప్రార్థనా సమావేశాలు నిర్వహించి మసీదులను అలంకరించుకుంటారు. ప్రజలు స్నేహితులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తారు. స్వీట్లు పంచుకుంటారు. కొంతమంది ఈ రోజు ఉపవాసం కూడా ఉంటారు. ప్రజలు కూడా ఈ రోజున ఆకుపచ్చ రిబ్బన్లు లేదా ఆకుపచ్చ దుస్తులు ధరిస్తారు. ఆకుపచ్చ జెండాలను పట్టుకుని ఖురాన్ చదువుతారు. ఆకుపచ్చ రంగు ఇస్లాం.. స్వర్గానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. చాలా మంది దీనిని నమ్మతున్నారు.
భారతదేశంతో పాటు చాలా దేశాలలో ఈద్-ఎ-మిలాద్ ను విస్తృతంగా జరుపుకుంటారు. అయితే, ముస్లిం సమాజంలోని అనేక వర్గాలు ప్రవక్త పుట్టినరోజు వేడుకలకు ఇస్లామిక్ సంస్కృతిలో స్థానం లేదని నమ్ముతారు. సలాఫీ, వహాబీ ఆలోచనా పాఠశాలలకు చెందిన ముస్లింలు పండుగల సంప్రదాయాన్ని గుర్తించరు.