కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. భారతదేశంకూడా చేసేదేమిలేక లాక్ డౌన్ లోనే ఉండిపోయింది. లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా దినసరి కూలీలు, రెక్కాడితే కానీ డొక్కాడనివారు ఆకలితో కూడా అలమటిస్తున్నారు. 

తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ సంఘటనను చూస్తే మన కండ్లు చెమర్చక మానవు. ఢిల్లీలోని యమునా నది బ్రిడ్జి కింద చాలా మంది వలస కూలీలు, యాచకులు ఈ లాక్ డౌన్ వేళ ఆ ప్రాంతాన్ని తమ ఆవాసంగా మలుచుకున్నారు. 

యమునా నది నిగంబోధ్ ఘాట్ పరిసరాల్లో కుళ్లిపోయి, దాదాపుగా పాడయిపోయిన అరటిపండ్లను ఎవరో పడేసారు. బహుశా ఆ ఘాట్ వద్ద పిండ ప్రధానాలు అధికంగా జరుగుతాయి కాబట్టి ఆ సందర్భంగా మిగిలిపోయినవి అయి ఉండొచ్చు. 

ఈ అరటి పండ్లు పడేయడంతో మిట్టమధ్యాహ్నం ఎండలో అక్కడే ఉన్న వలస కూలీలు ఈ అరటిపండ్లను ఏరుకుంటూ కనబడ్డారు. వారిలోఈ అరటి పండ్లను ఒక సంచిలో నింపుకుంటున్న వ్యక్తిని అడిగితే.... ఈ పండ్లు ఇంకా పూర్తిగా పాడుకాలేదని, ఇంకో రెండు రోజులు తమ ఆహరం తీరుస్తాయని చెప్పాడు. అతను యాచకుడిని కాదని ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక వలసకూలినని బదులు ఇచ్చాడు. 

తమకు ఎటుబడి రోజు ఆహరం దొరకనందున ఈ అరటిపండ్లు తన ఆకలిని తీరుస్తాయని అన్నాడు. ఇలా కేవలం ఒక్కడే కాకుండా పాదులసంఖ్యలో వలసకూలీలు ఈ అరటి పండ్లను ఏరుకుంటున్న హృదయ విదారకమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

లాక్ డౌన్ ప్రకటించిన నాటినుంచి చాలామంది వలస కూలీలు తమ ఊర్లకు వెళ్లలేక, ఉండడానికి చోటు లేక ఇలా రోడ్లపైన్నే ఉంటున్నారు. ముఖ్యంగా ఉత్తర ఢిల్లీలోని ఈ ప్రాంతంలో అధికంగా కనబడుతున్నారు. 

ఈ సంఘటన వైరల్ గా మారడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీరందరికి వసతి సదుపాయం కల్పించారు. అందరిని షెల్టర్ కి తరలించి లాక్ డౌన్ అయిపోయే వరకు వారికి తిండి, ఉండడానికి వసతి ఢిల్లీ ప్రభుత్వం కల్పిస్తుందని అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.