దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించగా.. వలస కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు. చేసుకోవడానికి పని లేక.. తినడానికి తిండి లేక అవస్థలు పడ్డారు. వారి కష్టాన్ని గుర్తించిన కేంద్రం శ్రామిక్ రైళ్ల తో వారికి స్వ రాష్ట్రాలకు తరలించింది. అయితే.. అలా స్వరాష్ట్రానికి చేరిన ఓ వలస కార్మికుడు క్వారంటైన్ కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన కర్ణాటకలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన 51 ఏళ్ల వలసకార్మికుడు ముంబై నగరంలోని ఓ హోటల్ లో పనిచేసేవాడు. లాక్ డౌన్ వల్ల హోటల్ మూతపడటంతో అతను తన స్వగ్రామమైన మూదబిద్రీ పట్టణానికి తిరిగి వచ్చాడు. ముంబై నుంచి వచ్చిన వలసకార్మికుడిని అదే పట్టణంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. 

లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోవడంతోపాటు క్వారంటైన్ కు తరలించడంతో ఆవేదన చెందిన వలసకార్మికుడు క్వారంటైన్ కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య ముగ్గురు కూతుళ్లున్నారు. లాక్ డౌన్ తో ఆవేదన చెంది వలసకార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. 

కర్ణాటక రాష్ట్రంలోనే గతంలో ఓ వ్యక్తి క్వారంటైన్ లో ఉన్న ఆసుపత్రి భవనం మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కర్ణాటక రాష్ట్రంలో క్వారంటైన్ లో ఉన్న ఇద్దరు వలసకార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. 

కాగా బెంగళూరు నగరంలోని గిరినగర్, అనేకల్ ప్రాంతాల్లో ఉన్న భవనాల్లో వలసకార్మికులను క్వారంటైన్ చేయవద్దని, దీనివల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని ఆయా ప్రాంతాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.