వలసకార్మికులను తరలించేందుకు కేంద్రం ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. శ్రామిక స్పెషల్‌ టైన్‌లో వెళ్తున్న ఓ వలస కార్మికుడు ప్రాణాలు విడిచాడు. కాగా.. అతని శవంతోనే దాదాపు 8గంటలపాటు తోటి ప్రయాణికులంతా స్వస్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న ఓ శ్రామిక్ రైలులో బుద్ధా పరిహార్(50) అనే ఓ వలస కార్మికుడు చనిపోయాడు. కాగా.. అతని స్వస్థలం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మల్దా జిల్లా హరిచంద్రపూర్ ప్రాంతం. కాగా.. పని నిమిత్తం రాజస్థాన్ వలస వెళ్లాడు. అక్కడ అతను ఓ హోటల్ లో పనిచేసేవాడు. అతని బావమరిది సరజు దాస్ కూడా అదే హోటల్ లో పనిచేసేవాడు.

బుద్ధా పరిహార్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. వారంతా 20 సంవత్సరాల క్రితమే రాజస్థాన్ వలస వచ్చేశారు. అయితే.. కరోనా లాక్ డౌన్ కారణంగా బుద్ధా పరిహార్ తన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో వారు స్వస్థలానికి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ.. డబ్బులు లేక వెళ్లలేకపోయారు. చివరకు వారికి మే 29వ తేదీన శ్రామిక్ రైలులో స్వస్థలానికి వెళ్లే అవకాశం లభించింది.

అయితే.. రైలు ఎక్కిన కొద్ది సేపటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. అతని శవంతో దాదాపు తోటి ప్రయాణికులు 8గంటలపాటు ప్రయాణం చేశారు. అయితే.. బుద్దా కరోనా వైరస్ కారణంగానే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు అనుమానిస్తున్నారు. అతనితోపాటు ప్రయాణించినవారందరికీ కూడా కరోనా సోకే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కాగా.. ముందునుంచే అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. ముందుస్తు జాగ్రత్తలో భాగంగా అతని శవానికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా అతని కుటుంబసభ్యులు, తోటి ప్రయాణికులకు కూడా పరీక్షలు  చేస్తామని చెప్పారు.