Cyclone Michaung: పోర్టును తలపిస్తున్న ఎయిర్‌పోర్టు.. రేపటి దాకా చెన్నై విమానాశ్రయం క్లోజ్
చెన్నైలో మిచౌంగ్ తుఫాన్ విరుచుకుపడుతున్నది. కుండపోత వర్షంతో నగరంలో వరద పోటెత్తుతున్నది. చెన్నై విమానాశ్రయం నీట మునిగింది. ఈ ఎయిర్‌పోర్టు.. సముద్రం పక్కనే ఉండే పోర్టులా మారిపోయింది.
చెన్నై: మిచౌంగ్ తుఫాన్ తమిళనాడులో ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నది. కుండపోతగా వర్షం పడుతున్నది. దీంతో రద్దీగా ఉండే చెన్నై విమానాశ్రయం నీట మునిగింది. ఎయిర్ పోర్టు ఆవరణ మొత్తం నీటితో నిండిపోయింది. ఎటు చూసినా నీరే కనిపిస్తున్నది. దీంతో విమాన సేవలు నిలిచిపోయాయి. పలుమార్లు సమీక్ష చేస్తూ విమానాశ్రయాన్ని రేపు ఉదయం వరకు క్లోజ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
రేపు ఉదయం 9 గంటలకు తిరిగి విమానాశ్రయాన్ని ఓపెన్ చేస్తామని అధికారులు తెలిపారు. అన్ని విమానాలను బెంగళూరుకు డైవర్ట్ చేశారు.
చెన్నై విమానాశ్రయంలో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరద నీటిలోనే విమానాలు నిలిచి ఉన్నాయి. విమానాల టైర్లు నీటిలో మునిగిపోయాయి. సిబ్బంది ఈ టైర్ల వద్ద పరిశీలనలు చేస్తున్న ఓ వీడియో వైరల్ అవుతున్నది. ఆ దృశ్యాలు చూస్తే అది ఎయిర్‌పోర్టులా లేదు.. సముద్రం పక్కనే ఉండే పోర్టులా ఉన్నదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మిచౌంగ్ తుఫాన్ విరుచుకుపడుతున్నది. రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ తీరాన్నీ దాటే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో భీకరంగా వర్షాలు కురుస్తుండటం గమనార్హం.