Asianet News TeluguAsianet News Telugu

రామ భక్తులకు శుభవార్త.. ఇకపై ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. రామమందిరానికి సహకరించవచ్చు.. 

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విదేశీ విరాళాలు స్వీకరించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ తెలిపారు.

MHA grants FCRA approval to Ram temple trust, which can receive foreign donations KRJ
Author
First Published Oct 19, 2023, 6:21 AM IST | Last Updated Oct 19, 2023, 6:21 AM IST

విదేశాల్లో నివసిస్తున్న రామభక్తులు శుభవార్త. ఇప్పుడు రామ మందిర నిర్మాణానికి విదేశీ విరాళాలు తీసుకోవడానికి ఉన్న అడ్డంకి తొలగిపోయింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేసిన దరఖాస్తును భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ FCRA విభాగం ఆమోదించింది. రామమందిర్ ట్రస్ట్ ఇప్పుడు ప్రపంచంలోని ఏ కరెన్సీలోనైనా విరాళాలను స్వీకరించగలదు. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ బుధవారం తెలిపారు. ఈ డబ్బును ఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖలోని ట్రస్టు బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ఏదైనా ట్రస్ట్ విదేశీ విరాళాలు తీసుకోవడానికి కనీసం 3 సంవత్సరాల ఆడిట్ నివేదికను హోం మంత్రిత్వ శాఖకు సమర్పించాలని అన్నారు. రామ్ మందిర్ ట్రస్ట్ ఫిబ్రవరి 2023లో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మూడేళ్ల ఆడిట్ నివేదికను రూపొందించి జూలైలో దరఖాస్తు చేసుకున్నారు. దీనికి హోం శాఖ నుంచి అనుమతి లభించింది. విదేశాల్లో ఉన్న రామభక్తులు ఆలయ నిర్మాణానికి నిధులను విరాళంగా ఇవ్వాలని తమ కోరికను తరచుగా వ్యక్తం చేస్తారని, అయితే..ఇలాంటి విరాళాలు తీసుకోవడానికి ట్రస్ట్‌కు చట్టపరమైన గుర్తింపు లేదని చంపత్ రాయ్ చెప్పారు.

ఇప్పుడు ఈ అడ్డంకి తొలగిపోయింది. విదేశీ రామ భక్తులు ఆలయ నిర్మాణానికి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వవచ్చని తెలిపారు. హోం మంత్రిత్వ శాఖలోని FCRA విభాగం విదేశీ మూలాల నుండి స్వచ్ఛంద విరాళాలను స్వీకరించడానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రాన్ని అనుమతించిందని తెలిపారు. 

ప్రతినెలా కోటి రూపాయలకు పైగా విరాళాలు 

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యాలయ ఇన్‌చార్జి ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ.. రామ మందిరానికి ప్రతినెలా వివిధ మాధ్యమాల ద్వారా సుమారు కోటి రూపాయల విరాళాలు వస్తున్నాయన్నారు. నగదు, చెక్కు, ఆర్టీజీఎస్, ఆన్‌లైన్ విధానంలో భక్తులు ప్రతిరోజూ విరాళాలు అందజేస్తున్నారు. దీంతోపాటు రాంలాలా విరాళాల నుంచి ప్రతినెలా దాదాపు రూ.30 లక్షల విరాళాలు కూడా అందుతున్నాయి. ట్రస్ట్ 2021లో ఫండ్ డెడికేషన్ క్యాంపెయిన్ ప్రారంభించిందని, దీని ద్వారా సుమారు రూ. 3500 కోట్లు అందాయని చెప్పారు.

ఇక మందిర నిర్మాణానికి వస్తే.. అయోధ్యలో నిర్మిస్తున్న మూడంతస్తుల రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతాయని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. జనవరి 20 నుంచి 24వ తేదీ మధ్య ఏ రోజున అయినా ఆలయ కుంకుమార్చన జరగవచ్చని, దానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావచ్చని మిశ్రా చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చే సమాచారం ఆధారంగా చివరి తేదీని నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.

ఆలయం ఎప్పుడు పూర్తవుతుందో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. వారి కల నెరవేరింది. ఆలయం వాస్తవ రూపం దాల్చిందని అన్నారు.  ఆలయం రెండు భాగాలుగా పూర్తవుతుంది, మొదటి దశ 1 డిసెంబర్ 2023 నాటికి పూర్తి కానున్నది. రామమందిరం మొదటి దశ నిర్మాణ పనులు పూర్తి చేసి, వచ్చే ఏడాది జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం 23 నుంచి భక్తుల కోసం తెరవవచ్చని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ మిశ్రా తెలిపారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios