దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ‘‘రోహిత్ వేముల చట్టం’’ తీసుకురావాలని మహారాష్ట్రలోని వార్దాలోని మహాత్మా గాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయ (ఎంజీఏహెచ్‌వీ) విద్యార్థులు కేంద్రాన్ని కోరుతున్నారు. 

దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఫిబ్రవరి 12న ఐఐటీ బాంబేలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా.. 14వ తేదీన ఐఐటీ మద్రాసులో చదువుతున్న మరో విద్యార్థి బలవనర్మణం పొందాడు. ఈ ఘటనల నేపథ్యంలో.. అట్టడుగు వర్గాలకు చెందిన స్కాలర్స్‌ రక్షించేందుకు, ఆత్మహత్యలను నిరోధించేందుకు ‘‘రోహిత్ వేముల చట్టం’’ తీసుకురావాలని మహారాష్ట్రలోని వార్దాలోని మహాత్మా గాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయ (ఎంజీఏహెచ్‌వీ) విద్యార్థులు కేంద్రాన్ని కోరుతున్నారు.

మూడు రోజుల్లో జరిగిన రెండు విషాద మరణాలతో దిగ్భ్రాంతికి గురైన ఎంజీఏహెచ్‌వీ యూనిట్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) విద్యార్థి సభ్యులు వర్సిటీ రిజిస్ట్రార్ ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక మెమోరాండం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఏఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్ చందన్ సరోజ్, సెక్రటరీ జతిన్ చౌదరి, ఇతర ఆఫీస్ బేరర్లు నిరంజన్ కుమార్, అతుల్ సింగ్, విశాల్ కుమార్, గౌతమ్ ప్రకాష్, మరికొంతమందితో కూడిన ప్రతినిధి బృందం ఎంజీఏహెచ్‌వీ రిజిస్ట్రార్‌ను కలిసి తమ మెమోరాండమ్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపవలసిందిగా అభ్యర్థించింది.

రాష్ట్రపతికి పంపనున్న మెమోరాండంలో ఎంజీఏహెచ్‌వీ - ఏఐఎస్ఎఫ్ యూనిట్ రెండు తాజా సంఘటనలను ప్రస్తావించింది. ఫిబ్రవరి 12న ఐఐటీ బాంబేలో అహ్మదాబాద్ విద్యార్థి దర్శన్ ఆర్ సోలంకి, ఫిబ్రవరి 14న ఐఐటీ మద్రాస్‌లో నవీ ముంబై విద్యార్థి స్టీఫెన్ ఎస్ అలప్పట్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అలాగే ఐఐటీ మద్రాస్‌లో మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని.. ఇప్పుడు చెన్నైలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఇద్దరు విద్యార్థులు ఎదుర్కొన్న ఆరోపించిన కుల పక్షపాతం, వేధింపులను సూచించే నివేదికలను కూడా ప్రస్తావించారు. ఇది వారిని అపారమైన మానసిక వేదనను కలిగించి.. ఆత్మహత్యకు దారి తీసినట్టుగా పేర్కొన్నారు. 

‘‘2016 నుంచి భారతదేశంలోని క్యాంపస్‌లలో నివసిస్తున్న, చదువుతున్న అణగారిన వర్గాల విద్యార్థులకు భద్రత కల్పించేందుకు నిర్భయ చట్టం తరహాలో కఠినమైన రోహిత్ వేముల చట్టంను రూపొందించాలని భారతదేశం అంతటా విద్యార్థుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి’’ అని చందన్ సరోజ్ అన్నారు. 

‘‘ఓబీసీ వర్గానికి చెందిన పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల, కుల వివక్ష, వేధింపుల కారణంగా 2017 జనవరిలో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నాడని.. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా విద్యా ప్రాంగణాల్లో నిరసనలు చెలరేగాయని జతిన్ చౌదరి చెప్పారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రముఖ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని.. ఇది ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకుని.. ఇలాంటి దుర్ఘటనలను అరికట్టడానికి.. క్యాంపస్‌లలో, విద్యా ప్రపంచంలోని అన్ని స్థాయిలలో వెనుకబడిన వర్గాల విద్యార్థులపై దోపిడీని నివారించడానికి ‘రోహిత్ వేముల చట్టం’ రూపొందించాలని వారు రాష్ట్రపతిని కోరారు.