మెట్రోమ్యాన్ శ్రీధరన్ (Metroman Sreedharan) క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించారు. తాను ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకన్నానని చెప్పారు. బీజేపీలో చేరి ఏడాది కూడా పూర్తికాక ముదే శ్రీధరన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఢిల్లీ మెట్రో రూపకర్తగా నిలిచిన ప్రముఖ ఇంజనీర్ ఇ శ్రీధరన్ (E Sreedharan) మెట్రోమ్యాన్‌గా (Metroman) దేశవ్యాప్తంగా గుర్తింపు సొందం చేసుకన్నారు. అయితే ఆయన బీజేపీలో చేరిన ఏడాదిలోపే క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాని గురువారం కేరళలోని మలప్పురంలో శ్రీధరన్ వెల్లడించారు. ఏప్రిల్‌లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో (kerala assembly election 2021) ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకన్నానని చెప్పారు. తాను ఎప్పుడూ రాజకీయ నాయకుడిని కానని తెలిపారు. రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండకపోవడం అంటే.. తాను రాజకీయాలను పూర్తిగా వదిలేస్తున్నానని దాని అర్థం కాదని చెప్పారు. 

ఓటమితో నిరాశ చెందానని.. అయిన కూడా ఫరవాలదేని శ్రీధరన్ అన్నారు. ఆ సమయం గడిచిపోయిందని.. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే ఎమ్మెల్యేగా ఉండేవాడినని అన్నారు. అయితే పార్టీ తరఫున ఒంటరి ఎమ్మెల్యేగా ఉండి పెద్దగా ఏమి చేసేందుకు వీలు ఉండేంది కాదన్నారు. ‘నా వయసు ఇప్పుడు 90. రాజకీయాల్లోకి మరింత ముందుకు రావడం ప్రమాదకరం. నాకు ఇప్పుడు రాజకీయాల్లో ఎలాంటి కలలు లేవు. నా భూమికి సేవ చేయడానికి నాకు రాజకీయాలు అవసరం లేదు. నేను ఇప్పటికే మూడు ట్రస్టుల ద్వారా ఆ పని చేస్తున్నాను' అని శ్రీధరన్ అన్నారు

ఈ ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీధరన్‌ కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు కూడా సిద్దమని మనసులో మాటలను బయటపెట్టారు. ఇదిలా ఉంటే బీజేపీ కూడా శ్రీధరన్‌‌ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఇక, ఆ ఎన్నికల్లో పాలక్కడ్ నుంచి బరిలో నిలిచిన శ్రీధరన్.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ చేతిలో 3,859 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక, ఆ ఎన్నికల్లో బీజీపీ- ఎన్డీఏ కూటమి కనీసం కేరళలో 35 స్థానాల్లో విజయం సాధించాలని భావించింది.. కానీ ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది.