బెంగళూరులో మరోసారి మెట్రో పిల్లర్‌లో చీలికలు ఏర్పడటం కలకలం రేపుతోంది. నగరంలోని ఇందిరానగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ బేరింగ్‌లో శుక్రవారం చీలికలు కనిపించడాన్ని గుర్తించిన సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న బెంగళూరు మెట్రో రైల్వే కార్పోరేషన్ అధికారులు ఇందిరానగర్‌ మెట్రో స్టేషన్‌కు చేరుకుని పిల్లర్‌ను పరిశీలించారు. అయితే మెట్రో పిల్లర్లలో ఎటువంటి చీలికలు లేవని.. ఊహాగానాల ఆధారంగా ఆరోపణలు చేయడం సరికాదని అధికారులు తెలిపారు.

మరోవైపు ఎంజీ రోడ్డు-బయపనహళ్లి మార్గంలో నిర్వహణ పనులు చేపట్టాల్సి వుందని... అందువల్ల ఈ నెల 3,4 తేదీల్లో మెట్రో రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే పిల్లర్ల వద్ద చీలికలను సరిచేసేందుకే మెట్రో సేవలను నిలిపివేశారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.