తొలుత ఆధిక్యంలో కొనసాగిన బిజెపి అభ్యర్థి మెట్రో మ్యాన్ శ్రీధరన్ పాలక్కడ్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ చేతిలో ఆయన 7,403 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. కేరళ బిజెపి సీఎం అభ్యర్థిగా ఒక సందర్భంలో ఆయన పేరు ముందుకు వచ్చింది.

‘మెట్రో మ్యాన్’, బిజెపి అభ్యర్థి శ్రీధర్ కేరళ శాసనసభ ఎన్నికల్లో గెలుపు దిశగా పయనిస్తున్నారు. పాలక్కాడ్ నియోజకవర్గంలో ఆయన దాదాపు 6 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బిజెపి మొత్తం మీద నాలుగు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. 

ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) 85 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 71 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. కాంగ్రెస్ కూటమి 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఇకపోతే బిజెపి శ్రీధర్ ను పాలక్కాడ్ నుంచే పోటీ చేయించడానికి కారణాలు లేకపోలేదు. గత శాసనసభ ఎన్నికల్లో పాలక్కాడ్‌లో బిజెపి రెండో స్థానంలో నిలిచింది. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ బిజెపి అభ్యర్థి పై సుమారు 17 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో కూడా ఆయనే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 

మరోవైపు పాలక్కాడ్ మున్సిపాలిటీని గతంలో బీజేపీ గెలుచుకుంది. మెట్రో శ్రీధర్ (88) దిల్లీ మెట్రో వంటి భారీ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన ఇంజనీర్ గా మంచి పేరు సంపాదించారు. తమిళనాడులోని చారిత్రక పంబన్ బ్రిడ్జి ని పునరుద్ధరించడం తో ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. భారత ప్రభుత్వం ఆయనకు 2001లో పద్మశ్రీ, 2011 లో పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటించింది.

కేరళలో విజయన్ రికార్డు: వరుసగా రెండోసారి అధికారంలోకి ఎల్డీఎఫ్...

కాగా, కేరళ రాష్ట్రంలోని 140 సీట్లకు గాను ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో ఎన్నిక జరిగింది. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుండి ఎంపీగా గెలుపొందడం, శబరిమల అంశము అన్ని వెరసి జాతీయ నాయకత్వమంతా కేరళలో తిష్ట వేసింది. ప్రధానంగా ఎల్ డి ఎఫ్, యూ డి ఎఫ్ కూటముల మధ్య పోరు సాగినప్పటికీ... తమ ప్రాబల్యాన్ని పెంచుకొని రాష్ట్ర రాజకీయాల్లో ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ సైతం ఇక్కడ భారీ ఎత్తున ప్రచారం సాగించింది. 

కేరళలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారడమనేది ఒక నిత్యకృత్యంగా తయారయింది. దేశంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కూడా కేరళనే. ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకొని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఎల్ డి ఎఫ్ రంగంలోకి దిగింది. 

దేశవ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న కాంగ్రెస్ కి ఈ రాష్ట్రం గెలవడం అత్యవసరం. ఇక్కడ విజయం సాధించడం ద్వారా మొత్తం కాంగ్రెస్ క్యాడర్ లో ఒక జోష్ తీసుకురావొచ్చని వారు భావిస్తున్నారు. దానికి తోడు ఇక్కడ విజయాన్ని సాధించడాం ద్వారా రాహుల్ గాంధీ నాయకత్వానికి కూడా ఒక ఆమోదముద్ర పడుతుందని అనుకున్నాయి కాంగ్రస్ వర్గాలు. . 

ఇక శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం వ్యవహరించిన తీరును బీజేపీ సాధ్యమైనంత మేర వాడుకుంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఈ అంశం కలిసివస్తదని భావించినప్పటికీ... అది అంతలా కలిసిరాలేదు.