వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. ఫైల్స్, మెస్సేజీలు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సమస్య తలెత్తినట్టు తెలుస్తున్నది.
న్యూఢిల్లీ: ఈ రోజు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల నుంచి వాట్సాప్ సేవల్లో అంతరాయం మొదలైంది. చాలా మంది యూజర్లు తమ వాట్సాప్ పని చేయడం లేదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే, ఇందుకు గల కారణాలు ఏమిటో ఇప్పటికైతే తెలియరాలేదు. రెండు గంటల తర్వాత మళ్లీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఆన్‌లైన్ టూల్ డౌన్ డిటెక్టర్ ప్రకారం, ఈ ప్రాబ్లెమ్ 12.07 గంటలకు ప్రారంభమైనట్టు తెలిసింది. కాగా, ఒంటిగంట కల్లా వేలాది మంది ఈ సమస్యను లేవనెత్తినట్టు సమాచారం.
వాట్సాప్ యాప్ ఓపెన్ చేస్తే.. తెరుస్తున్నది. కానీ, మెస్సేజీలు, మీడియా ఫైల్స్ పంపిస్తే సెండ్ కావడం లేదు. ఇతరుల నుంచి రిసీవ్ కావడం లేదు. 69 శాతం మంది ఈ ప్రాబ్లమ్ ఉన్నదని చెప్పగా, ఇతరులు డిస్కనెక్షన్, అప్లికేషన్ క్రాష్ అయినట్టు పేర్కొన్నారు.
ఇటలీ, టర్కీ నుంచి కూడా వాట్సాప్ సమస్యలు ఎదుర్కొన్నట్టు యూజర్లు ఫిర్యాదులు చేశారు. మెస్సేజీలు పంపలేకపోతున్నట్టు పేర్కొన్నారు.
ఈ ఇష్యూపై వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా స్పందించింది. కొందరు యూజర్లు మెస్సేజీలు పంపలేకపోతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని వివరించింది. వీలైనంత త్వరగా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తామని తెలిపింది.
వాట్సాప్ డౌన్ కాగానే, పలువురు ఇతర సోషల్ మీడియా వేదికలను ఆశ్రయించి తమ స్టేటస్ చెక్ చేసుకున్నారు. చాలా మంది ట్విట్టర్ వేదికపై తమ వాట్సాప్ సేవలు పని చేయడం లేదని, ఇతరులకు కూడా ఈ అసౌకర్యం ఉన్నదా? లేక తమకే ఈ అంతరాయం కలిగిందా? అని చెక్ చేసుకున్నారు. ఇదే సందర్భంలో పలువురు జోకులు కూడా పేల్చారు.
