త్వరలోనే భారత్ లో పీవోకే విలీనం - కేంద్ర మంత్రి వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పీవోకే విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ త్వరలోనే భారత్ లో విలీనం అవుతుందని చెప్పారు. రాజస్థాన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) త్వరలోనే భారత్ లో విలీనం అవుతుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ అన్నారు. రాజస్థాన్ లోని డౌసాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీఓకే తనంతట తానుగా భారత్ లో విలీనం అవుతుందని చెప్పారు. దాని కోసం భారతీయులు మరి కొంత కాలం వేచి ఉండాలని చెప్పారు. పీఓకేలోని ప్రజలు తమను భారత్ లో విలీనం చేయాలని డిమాండ్ చేశారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాక్ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంతటా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాక్ అక్రమ ఆక్రమణ నుంచి తమని విముక్తుల్ని చేయాలని పీవోకే వాసులు ప్రధాని మోడీని కోరారు. పాక్ అక్రమ ఆక్రమణ నుంచి తమను విడిపించాలని పీఓకేకు చెందిన ప్రజలు భారత ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్లు పాక్ సామాజిక కార్యకర్త షబ్బీర్ చౌదరి ఆదివారం అంగీకరించారు.
‘‘ఈ విషయంలో పాకిస్తాన్ కలవరపడుతోంది, కానీ నేను విన్న అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పీఓకేలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో నివసిస్తున్న ప్రజలు భారత ప్రధాని నరేంద్ర మోడీని.. పాకిస్తాన్ అక్రమ ఆక్రమణ నుండి మాకు విముక్తి కలిగించాలని కోరారు. మా ఆత్మలను రక్షించండి, మేము ఆకలితో చనిపోతున్నాము, దయచేసి ఇక్కడకు వచ్చి మాకు సహాయం చేయండి’’ అని నినాదాలు చేశారని తెలిపారు.
కాగా.. పీఓకేలోని స్థానిక ఉద్యమకారుల నివేదికలు, వాదనల ప్రకారం.. క్షీణిస్తున్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ వాసులు కారణమవుతున్నారు. అందుకే గత మూడు నెలల్లో విద్యుత్ బిల్లులు రెట్టింపు కాగా, గోధుమ పిండి, ఇతర నిత్యావసరాలపై భారీగా పన్నులు విధిస్తున్నారని తెలుస్తోంది.