మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. తాము తినే ఆహారాన్ని ముట్టుకున్నాడని ఓ వ్యక్తిని  కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది. కుల రక్కసి కోరలకు ఓ అమాయకుడు బలయ్యాడు. 
మధ్యప్రదేశ్ లో అగ్రవర్ణాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ దళితుడిపై తమ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. 

విందులో ఆహారాన్ని ముట్టుకున్నాడని యువకుడిని కొట్టి చంపారు. ఈ కిరాతక ఘటన ఛతర్ పుర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెడితే..ఉన్నత వర్గానికి చెంది భూర సోని, సంతోష్ పాల్ అనే వ్యక్తులు కిషన్ పుర్ గ్రామంలో విందు ఏర్పాటు చేశారు. 

పార్టీ తరువాత ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు దేవరాజ్ అనురాగి అనే దళిత యువకుడిని పిలిపించారు. అయితే శుభ్రం చేసేముందు భోజనం చేద్దామని అనురాగి ఆహారం వడ్డించుకోగా మా ఆహారాన్ని ముడతావా అంటూ భూర సోని, సంతోష పాల్ లు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడిపై కర్రలతో దాడి చేశారు. 

తీవ్ర గాయాలపాలైన అనురాగి అక్కడిక్కడే మృతి చెందాడు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్లు ఛతర్ పుర్ ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు. త్వరలోనే వారిని పట్టుకుని శిక్ష పడేలా చేస్తామని తెలిపారు.