సర్కార్ బడికి మెలానియా ట్రంప్: కేజ్రీవాల్ కు భారీ షాక్
తమ భారత పర్యటనలో డోనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఆహ్వానం లేదు.
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులు రెండు రోజుల పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. తమ పర్యటనలో డోనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు.
అయితే, మెలానియా పాఠశాల సందర్శన కార్యక్రమం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేర్లను తొలగించారు. ఆమెతో పాటు వారు పాఠశాల సందర్శనకు వెళ్లే అవకాశం లేదు. అయితే, పాఠశాల ఢిల్లీలో ఉన్నందున వారిద్దరు హాజరు కావాల్సి ఉంటుందని కేజ్రీవాల్ ప్రభుత్వ వర్గాలంటున్నాయి.
డోనాల్డ్ ట్రంప్ తన అహ్మదాబాద్ పర్యటనలో సబర్మతి ఆశ్రమాన్ని కూడా సందర్శించే అవకాశం ఉంది. రాష్ట్ర అధికారుల సమాచారం ప్రకారం ట్రంప్ ఆశ్రమాన్ని సందర్శిస్తారని, అందుకు సంప్రదాయ రీతిలో ఆహ్వానం పలికేందుకు సిద్ధపడుతున్నామని సబర్మతీ ఆశ్రమ అధికారులు చెబుతున్నారు.
ఇదిలావుంటే, డోనాల్డ్ ట్రంప్ పర్యటన కోసం అహ్మదాబాద్ సర్వహంగులను సంతరించుకుంటోంది. ఈ నెల 24వ తేదీన ఆయన ట్రంప్ అహ్మదాబాద్ వస్తున్న విషయం తెలిసిందే.
డోనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి ఆగ్రాలోని చారిత్రక తాజ్ మహల్ ను సందర్శించనున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన పర్యటన. అందువల్ల అధికారిక ఎంగేజ్ మెంట్స్ గానీ, భారత్ వైపు నుంచి సీనియర్ డిగ్నిటరీస్ గానీ ఉండకపోవచ్చునని అంటున్నారు.
ట్రంప్ రాక సందర్భంగా ఆగ్రాలో ప్రధాని నరేంద్ర మోడీ, డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ పోస్టర్లు వెలిశాయి. ఈ నెల 24వ తేదీన వాళ్లు ఆగ్రాను సందర్శించే అవకాశం ఉంది.
అమృతసర్ కు చెందిన జగ్జోత్ సింగ్ రూబల్ అనే ఆర్టిస్టు భారత పర్యటనకు వస్తున్న డోనాల్డ్ ట్రంప్ పెయింటింగ్ వేస్తున్నారు. పెయింటింగ్ కు ఆయన తుది మెరుగులు దిద్దుతున్నారు.