మేఘాలయలో తొలి కరోనా కేసు నమోదైంది. ఇప్పటి వరకు మేఘాలయలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అనుకున్నారు. దీంతో.. తమ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అలా కోరిందో లేదో.. అక్కడ తొలి కరోనా కేసు నమోదైంది.

దీంతో అక్క‌డి స‌ర్కారు అప్ర‌మ‌త్త‌మైంది. షిల్లాంగ్‌లోని బెథ‌నీ ఆసుప‌త్రిలో ప‌నిచేస్తున్న వైద్యుడికి క‌రోనా పరీక్ష‌లు నిర్వ‌హించ‌‌గా సోమ‌వారం పాజిటివ్‌గా తేలింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మార్చి 22 నుంచి స‌ద‌రు ఆసుప‌త్రికి వెళ్లినవారు వెంట‌నే 108ను సంప్ర‌దించాల‌ని, లేదా http://meghalayaonline.gov.in/covid/login.htm లో త‌మ పేరు ‌న‌మోదు చేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. ఆ ఆసుప‌త్రి నుంచి రోగులు, డాక్ట‌ర్లు, న‌ర్సు, ఇత‌ర సిబ్బంది ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేసింది. 

మ‌రోవైపు అధికారులు అత‌నితో స‌న్నిహితంగా మెలిగిన వారి వివ‌రాలు సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో నేటి నుంచి 48 గంట‌ల‌పాటు క‌ర్ఫ్యూ విధించారు. 

ఈశాన్య రాష్ట్రాల్లో భాగమైన నాగాలాండ్ లో తొలి కరోనా కేసు నమోదైంది. అసోం ఆరోగ్య మంత్రి హిమంతా బిశ్వాస్ శర్మ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. దిమాపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడంతో గువహటికి నమూనాలు పంపించగా, పాజిటివ్ వచ్చిందని తెలిపారు. 

ప్రస్తుతం ఆయన్ను అక్కడి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించామని తెలిపారు. ఇదే విషయాన్ని వెల్లడించిన అసోం మంత్రి, దిమాపూర్ కు చెందిన సదరు పేషంట్ ను నాగాలాండ్ ప్రభుత్వం నేరుగా సిఫార్సు చేసిందని పేర్కొంది.

ఇక ఇదే విషయాన్ని ఖరారు చేసిన నాగాలాండ్ ఆరోగ్య మంత్రి ఎస్ పాంగ్యూ, తొలి కేసు నమోదు కావడంతో అప్రమత్తమయ్యామని ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అతనితో కాంటాక్ట్ అయిన  వారందరినీ వెంటనే క్వారంటైన్ చేశామని వెల్లడించారు. దిమాపూర్ లో తొలి కేసు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో టెస్టింగ్ లాబొరేటరీ లేదని, అందువల్లే అనుమానితులకు పరీక్షలు చేసేందుకు నమూనాలను అసోం పంపుతున్నామని తెలిపారు. ఆదివారం వరకూ రాష్ట్రానికి చెందిన 74 నమూనాలను పరీక్షించామని ఆయన అన్నారు. ఇప్పటివరకూ ఇండియాలోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో మాత్రమే ఇంతవరకూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. తాజాగా కరోనా సోకిన రాష్ట్రాల జాబితాలో నాగాలాండ్ చేరిపోవడంతో, మేఘాలయ మాత్రమే కరోనా రహితంగా ఉన్నట్లయింది.