Asianet News TeluguAsianet News Telugu

Meghalaya congress: మేఘాలయ కాంగ్రెస్‌లో అర్ధరాత్రి తిరుగుబాటు.. ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలు జంప్..

మేఘాలయలో (Meghalaya) అర్ధరాత్రి  కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs) ఆ పార్టీ వీడి.. తృణమూల్ కాంగ్రెస్‌లో (Trinamool Congress) చేరారు. వారిలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా (Mukul Sangma) కూడా ఉన్నారు.

Meghalaya 12 Of 17 Congress MLAs Join Trinamool congress
Author
Shillong, First Published Nov 25, 2021, 9:41 AM IST

ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో (Meghalaya) అర్ధరాత్రి కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs) ఆ పార్టీ వీడి.. తృణమూల్ కాంగ్రెస్‌లో (Trinamool Congress) చేరారు. వారిలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా (Mukul Sangma) కూడా ఉన్నారు. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన 12 మంది ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి  10 గంటల సమయంలో అసెంబ్లీ స్పీకర్  మెత్‌బా లైంగ్‌దోహ్‌కు తమ హోదా మార్పు గురించి లేఖ సమర్పించినట్టుగా తెలుస్తోంది. మేఘాలయలోని 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మంది తమ పార్టీలో చేరారని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు చెప్పుకొచ్చాయి. 

దీంతో మేఘాలయలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 17 నుంచి 5కు పడిపోయింది. కాంగ్రెస్‌ను వీడిన 12 మంది ఎమ్మెల్యేలు.. నేడు మధ్యాహ్నం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేఘాలయ ఇంచార్జ్‌గా ఉన్న మనీష్ చత్రత్ (Manish Chatrath) గురువారం మేఘాలయకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా ఆ పార్టీకి చెందిన సంబంధిత వర్గాలు తెలిపాయి. మేఘాలయ చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మనీష్ చత్రత్ రేపటి గుజరాత్ పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్టుగా పేర్కొన్నాయి. మేఘాలయ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై మనీష్.. తర్వలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి (Sonia Gandhi) పూర్తి నివేదిక అందజేయనున్నారు. 

కొద్ది నెలల కిందట జరిగిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన మమతా బెనర్జీ (Mamata Banerjee) మూడో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో దూకుడు ప్రదర్శిస్తున్న మమతా బెనర్జీ.. పార్టీని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ ఇటీవల గోవాలో కూడా పర్యటించారు. మరో త్రిపురలో కూడా టీఎంసీ గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీపై పోరుకు సిద్దమవుతుంది. బీజేపీకి వ్యతిరేకంగా తృణమూల్ పోరాటంలో చేరాలనుకునేవారిని తమ పార్టీ స్వాగతిస్తుందని మమతా బెనర్జీ అన్నారు. 

అయితే తృణమూల్ అనుసరిస్తున్న విధానాలు.. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కాంగ్రెస్‌ పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయి. అసోం, త్రిపుర, గోవా, ఉత్తరప్రదేశ్‌, బిహార్, హర్యానాలలో టీఎంసీ పార్టీ విస్తరించాలనే ప్రణాళికలు కాంగ్రెస్‌కు నష్టాన్ని చేకూరుస్తున్నాయి.

మరోవైపు ఈ సారి ఢిల్లీ పర్యటనకు వచ్చిన మమతా బెనర్జీ... కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీని గురించి ఆమెను ప్రశ్నించగా.. మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నందునే.. సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదని చెప్పారు. అంతేకాకుండా... తాము ప్రతిసారి సోనియా గాంధీని ఎందుకు కలవాలని ప్రశ్నించారు. అది రాజ్యాంగం చేసిన ఆదేశం కాదంటూ ఫైర్ అయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios