ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడిగా వున్న గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ సహా మరో నిందితుడు గుల్హామ్‌లను యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బలగాలు హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడిగా వున్న గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్‌ను పోలీసులు గురువారం ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. అతడితో పాటు మరో నిందితుడు గుల్హామ్ కూడా ఈ ఘటనలో హతమయ్యాడు. యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బలగాలు (ఎస్‌టీఎఫ్) ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాయి. ఘటనా స్థలిలో అత్యాధునిక విదేశీ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎస్‌టీఎఫ్ బృందానికి డీఎస్పీ నవేందు సింగ్, విమల్‌లు నేతృత్వం వహించారు.
నవేందు సింగ్ 2018లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లో చేరారు. ప్రస్తుతం ఎస్టీఎఫ్‌లో డీఎస్పీ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఓ దొంగతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నవేందు సింగ్ చేతికి, మెడకి గాయాలయ్యాయి. అంతేకాదు.. గతేడాది ఇద్దరు హై ప్రొఫైల్ నేరస్తులను నవేందు సింగ్ ఎన్‌కౌంటర్ చేశారు. ఆయన సేవలకు గాను 2008లో రాష్ట్రపతి శౌర్య పతకం, 2014లో జాతీయ శౌర్య పతకం అందుకున్నారు. 2022లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నవేందు సింగ్ రాష్ట్రపతి అవార్డ్‌ను అందుకున్నారు.
యూపీ ఎస్టీఎఫ్‌పై యోగి ప్రశంసలు..
ఈ ఎన్ కౌంటర్ పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. యూపీ ఎస్టీఎఫ్‌పై ప్రశంసలు కురిపించారు. హోం ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్ ఈ ఎన్‌కౌంటర్ విషయాన్ని సీఎంకు సమాచారం అందించారు. అయితే ఈ ఎన్‌కౌంటర్ తర్వాత శాంతిభద్రతలకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం ముందు నివేదిక ఉంచారు. ఉమేష్ పాల్ హత్య కేసు తరువాత అసద్ అహ్మద్ పరారీలో ఉన్నారు.
ఏమిటీ ఉమేష్ పాల్ హత్య కేసు ?
2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య జరిగింది. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్ రాజ్ లోని ధూమన్ గంజ్ ప్రాంతంలోని ఆయన నివాసం వెలుపల పలువురు కాల్చి చంపారు. ఉమేష్ పాల్ భార్య జయ పాల్ ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 25న అతిక్ అహ్మద్, అష్రఫ్, వారి కుటుంబ సభ్యులు, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 147 (అల్లర్లు), 148 (మారణాయుధాలతో అల్లర్లు), 149 (సాధారణ వస్తువును ప్రాసిక్యూషన్ చేయడంలో చేసిన నేరానికి చట్టవిరుద్ధంగా గుమిగూడడం), 302 (హత్య), 307 (హత్యాయత్నం), 506 (క్రిమినల్ బెదిరింపు) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అతిక్ అహ్మద్ కు కూడా ఎన్ కౌంటర్ భయం ?
తనకు ప్రాణహాని ఉందని, ఉత్తరప్రదేశ్ పోలీసులు తనను బూటకపు ఎన్ కౌంటర్ లో చంపేస్తారని అతిక్ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉమేష్ పాల్ కేసులో తనను, తన కుటుంబాన్ని నిందితులుగా తప్పుడు కేసులో ఇరికించారని, తనను చంపేస్తారని గత నెలలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన అభ్యర్థనను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ విషయంలో రక్షణ కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను ఇచ్చింది.
