అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాను ఎవరైనా స్ఫూర్తిదాయకమైన మహిళకు ఇస్తాను అని చెప్పిన విషయం తెలిసిందే. అన్నట్టే నేడు ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాను మాళవిక అయ్యర్ అనే మహిళకు అప్పగించారు. 

మాళవిక అయ్యర్ గురింతి తెలుసుకుంటే... ఆమె ఎంత ప్రత్యేకమో... నరేంద్ర మోడీ ఎందుకు ఆమెను స్ఫూర్తిదాయకమైన మహిళగా నమ్మారో అర్థమవుతుంది. 13 ఏండ్ల వయసులోనే తన రెండు చేతులను బాంబ్ బ్లాస్ట్ లో పోగొట్టుకున్న మాళవిక... తన చేతులను కోల్పోయినప్పటికీ తన ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. 

ఆ బాంబు పేలుడులో ఆమె రెండు చేతులను కోల్పోవడంతోపాటు తన రెండు కాళ్ళు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆమె అలా తన రెండు చేతులను కోల్పోయినప్పటికీ... తన ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోకుండా పిహెచ్ది పూర్తి చేసింది. డాక్టరేట్తో అందుకున్న తరువాత ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది. 

రెండు చేతులు లేకున్నా ఎలా టైపు చేశానని అనుకుంటున్నవారంతా ఒకసారి నా కుడి చేతిని చూడండి. అక్కడి నుండి ఒక ఎముక పొడుచుకొచ్చినట్టుందికదా అదే నా స్పెషల్ ఫింగర్. దానితోనే పీహెచ్డీ థీసిస్ కూడా టైపు చేసినట్టు మాళవిక చెప్పుకొచ్చింది. 

రెండు చేతులు లేకున్నప్పటికీ తాను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని, ఎవరు అలా కోల్పోకూడదని ఆమె అన్నారు. జీవితాన్ని మార్చలేకపోయినప్పటికీ... మనం జీవితాన్ని చూసే విధానంలో మార్పులు తీసుకురాగలుగుతామని ఆమె అభిప్రాయపడింది. 

సమాజంలో మార్పు తీసుకురాగల సామర్థ్యం ఒక్క విద్యకు మాత్రమే ఉందని ఆమె అభిప్రాయపడింది. సమాజంలో పిల్లలకు విద్యని నేర్పిస్తే వారు సమాజంపట్ల ఒక అవగాహనను పెంచుకుంటారని, దివ్యంగులపట్ల వారి సమస్యలను అర్థం చేసుకునేలా తయారవుతారని ఆమె అభిప్రాయపడ్డారు.