ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఎంతలా ప్రబళుతుందో అందరికీ తెలిసిందే. ఎక్కడ ఎవరికీ ఎలా కరోనా సోకుతుందో అర్థం కావడం లేదు. కొద్దిపాటి జలుబు, జ్వరం కనిపించినా.. భయంతో వణికిపోతున్నారు. ముందు జాగ్రత్తలో భాగంగా చాలా మంది కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. కాగా..  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కొందరు డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు.

అడిగినంత ఇస్తే కరోనా లేదని రిపోర్టిస్తాం అంటూ రోగులతో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు బేరాలు కుదుర్చుకుంటున్నాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో  చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

అడిగినంత ఇస్తే కరోనా లేదని రిపోర్టిస్తాం అంటూ రోగులతో బేరాలు కుదర్చుకుంటున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిపై ఉత్తరప్రదేశ్ అధికారులు కొరడా ఝళిపించారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడినందుకు ఆ ఆస్పత్రి లైసెన్సును రద్దు చేశారు. మీరట్ నగరంలో ఈ ఘటన జరిగింది. 

ఆస్పత్రికి చెందిన సిబ్బంది రూ. 2500లకు కరోనా లేదని రిపోర్టిస్తామని బేరమాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయింది. దీనిపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 

విషయం ఆరోగ్య శాఖ అధికారుల వరకూ వెళ్లడంతో వారు వెంటనే ఆస్పత్రి లైసెన్సు రద్దు చేసి..భవనానికి సీలు వేశారు.  ‘సదరు ఆస్పత్రి లైసెన్సు రద్దు చేశాం. ఆస్పత్రికి సీలు కూడా వేశాం. సంక్షోభ సమయంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని జిల్లా వైద్యాధికారి అనీల్ ధింగ్రా హెచ్చరించారు.