న్యూఢిల్లీ: తన తరఫున వాదిస్తున్న న్యాయవాదిని తొలగించానని, అందు వల్ల తనకు మరింత గడువు కావాలని నిర్భయ కేసు దోషి పవన్ గుప్తా కోర్టును కోరాడు. కొత్త న్యాయవాదిని నియమించుకునేంత వరకు విచారణ వాయిదా వేయాలని అతను కోరాడు. 

నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో దోషులైన ముకేష్ సింగ్, అక్షయ్ ఠకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తాలకు ఒకేసారి ఉరిశిక్ష విధించాలని, చట్టపరంగా ఉన్న అవకాశాలను అన్నింటిని వారు ఈలోగా వాడుకోవాలని ఢి్లలీ కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.

చట్టపపరమైన అవకాశాలు వాడుకోవడానికి ఏడు రోజుల గడువు ఇస్తున్నట్లు కోర్టు ఈ నెల 5వ తేదీన తెలిపింది. ఈ నేపథ్యంలో కేసు బుధవారంనాడు మరోసారి విచారణకు వచ్చింది. ఈ క్రమంలో తన తరఫున వాదించేందుకు ఎవరూ లేని కారణంగా తనకు మరింత సమయం ఇవ్వాలని నిర్భయ కేసు దోషుల్లో ఒక్కడైన పవన్ గుప్తా కోరాడు. 

దానికి స్పందించిన కోర్టు తాము న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని చెప్పింది. కేసును గురువారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. శిక్ష అమలులో జాప్యం జరగడానికి దోషులు నాటకాలు ఆడుతున్నారని ఆమె అన్నారు. 

దోషులకు ఉరిశిక్ష విధించడదానికి సంబందించిన న్యాయపరమైన ఆటంకాలు తొలగిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని తాను ఏడాదిన్నరగా అడుగుతున్నానని, ఢిల్లీ హైకోర్టుకు తీర్పునకు అనుగుణంగా వారికి డెత్ వారంట్లు జారీ చేయలేదని ఆమె అన్నారు. వారికి వారం రోజుల గడువు ఇచ్చారని, ఇప్పుడు లాయర్ లేకుండా కోర్టుకు వచ్చారని ఆమె అన్నారు.

 

బాధితురాలి తల్లిని అయిన తాను ఇక్కడే ఉన్నానని, చేతులు జోడించి న్యాయం కోసం అర్థిస్తున్నానని, మరి తన హక్కులు ఏమైనట్లు అని ఆమె న్యాయమూర్తి ముందు తన ఆవేదనను వ్యక్తంచేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరు హక్కుల గురించి ఆలోచిస్తున్నారని, అందుకే ఈ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయని న్యాయమూర్తి సమాధానమిచ్చారు. 

సోమవారం వరకు దోషుల తరఫున వాదిచిన న్యాయవాది ఏపీ సింగ్ ఏమయ్యారని, ఇప్పుడు పవన్ గుప్తా తన న్యాయవాదిని తొలగించుకోవడం ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందని నిర్భయ తరఫు న్యాయవాది అన్నారు. అతడికి లాయర్ ను పెడుతామని, ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయేమో ఆలోచిస్తామని న్యాయమూర్తి చెప్పారు. 

నిర్భయకు అన్యాయం చేసినవారికి న్యాయవాదిని పెడితే అన్యాయం చేసినవాళ్లవుతారని నిర్భయ తండ్రి అనగా వాళ్లకు న్యాయవాదిని పెట్టకపోవడం అన్యాయమవుతుందని న్యాయమూర్తి అన్నారు. 

ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి ఆశాదేవి, సామాజిక కార్యకర్త యోగితా భయానాతో కలిసి కోర్టు ప్రాంగణంలో నిరసనకు దిగారు. దోషులను ఉరి తీయాలని నినాదాలు చేశారు.