ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ బాలింతను పొట్టన పెట్టుకుంది. అప్పుడే జన్మించిన ఓ చిన్నారికి తల్లిని దూరం చేసింది. కర్ణాటక,హొసూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. 

హోసూరు సమీపంలోని తొడుదేపల్లి గ్రామానికి చెందిన దేవరాజ్‌ భార్య పవిత్ర (21) నిండు గర్భిణి. ఈనెల 3వ తేదీన ఆమె ప్రసవం కోసం హొసూరు ప్రభుత్వం ఆస్పత్రిలో చేరింది. ఆదివారం సాయంత్రం  మగబిడ్డకు జన్మనిచ్చింది. 

తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. అయితే రాత్రి 7 గంటల సమయంలో పవిత్ర మృతి చెందింది. విషయం తెలుసుకొన్న బంధువులు ఆందోళనకు దిగారు.

ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి భూపతి, డీఎస్పీ మురళీ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రసవం అనంతరం పవిత్రకు నొప్పులు ఎక్కువ కావడంతో మృతి చెందిందని వారికి వివరించారు. ఇదిలా ఉంటే ఇటీవల హొసూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.