రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ల మధ్య పోరు నడుస్తున్న తరుణంలో సోమవారం సీఎం మీడియాపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రజా ప్రయోజనాలే కేంద్రంగా సాగాలని, అంతేకానీ, ప్రజలు కొట్టుకునేలా ప్రవర్తించరాదని అన్నారు. 

జైపూర్: రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌కు మధ్య పోరు నడుస్తున్న సమయంలో.. మీడియా ప్రజలను గొడవ పెట్టుకోవడానికి పూనుకోరాదని అన్నారు.

రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి సీఎం సీటు గురించి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ల మధ్య పోరు సాగుతూనే ఉన్నది. తాజాగా, సచిన్ పైలట్ మరోసారి సీఎం గెహ్లాట్ పై పోరు ప్రకటించారు. గత బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఘటనను సీఎం అశోక్ గెహ్లాట్ చూసీ చూడనట్టు వదిలిపెడుతున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ పోరు ఇంకా అలాగే కొనసాగుతున్నది. ఈ ఏడాది చివరిలో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఉండటం గమనార్హం.

ఈ తరుణంలో అశోక్ గెహ్లాట్ మీడియాతో సోమవారం మాట్లాడారు. ‘మీడియా నిజాలు, వాస్తవ విషయాలకు అంకితం కావాలి. అంతేకానీ, ప్రజలు ఒకరినొకరు కొట్టుకునేలా మీడియా చేయరాదు. మీడియా ప్రతినిధులు వారి విధులను పూర్తి చేసుకోవాలి. అది ప్రజా ప్రయోజనాలే కేంద్రంగా ఉండాలి. వాస్తవాలను ప్రచారం చేయడానికి మీడియా ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి’ అని అశోక్ గెహ్లాట్ అన్నారు.

‘తప్పుడు ఆధారాలు, అంకెలతో.. మమ్మల్ని పొగడ్తల్లో ముంచెత్తాలని నేను అనను. కానీ, మీడియా వాస్తవా విషయాల ఆధారంగా నడుచుకోవాలి. మీడియాపై కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉన్నది. కానీ, వారు ప్రజా ప్రయోజనాలనే లక్ష్యంగా మసులుకోవాలి’ అని గెహ్లాట్ తెలిపారు.