Asianet News TeluguAsianet News Telugu

ముంబైలో మీజిల్స్ కలకలం.. కొత్తగా 32 కేసులు.. 1.34 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సిన్ అందించనున్న బీఎంసీ

మహారాష్ట్రలో మీజిల్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ వైరల్ వ్యాధి పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముంబైలో శనివారం  కొత్తగా 32 మీజిల్స్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

Measles outbreak Mumbai reports 32 fresh cases
Author
First Published Nov 27, 2022, 10:13 AM IST

మహారాష్ట్రలో మీజిల్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ వైరల్ వ్యాధి పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముంబైలో శనివారం  కొత్తగా 32 మీజిల్స్ కేసులు నమోదయ్యాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తెలిపింది. ముంబైలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. పిల్లలకు మీజిల్స్- రుబెల్లా కంటైనింగ్ వ్యాక్సిన్‌‌‌‌(ఎంఆర్ వ్యాక్సిన్) వేయించడంపై బీఎంసీ దృష్టి సారించింది. వ్యాక్సిన్ అదనపు డోస్‌ను 9 నెలల నుంచి 5 సంవత్సరాల వయస్సు గల 1,34,833 మంది పిల్లలకు అందజేస్తుంది.

ఇదిలా ఉంటే.. పొరుగున ఉన్న భీవాండికి చెందిన ఎనిమిది నెలల బాలుడు మీజిల్స్‌తో పోరాడుతూ ఈ నెల 22న ముంబైలోకి ఆస్పత్రిలో మరణించిన సంగతి  తెలిసిందే. నవంబరు 20న ఆ చిన్నారికి శరీరమంతా దద్దుర్లు రావడంతో 22వ తేదీ సాయంత్రం ముంబైలోకి మున్సిపల్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడ చేర్పించిన కొన్ని గంటల్లోనే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 

మీజిల్స్ కేసుల పెరుగుదలను నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అదనపు మోతాదులను నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోకి పిల్లలు ఈ డోసులను పొందబోతున్నారు. ఇక, మహారాష్ట్రతోపాటు బీహార్‌, గుజరాత్‌, హర్యానా, జార్ఖండ్‌, కేరళలోనూ మీజిల్స్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ మరియు మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో పెరుగుతున్న కేసుల పట్ల తాము ఆందోళన చెందుతున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేసులను ఎదుర్కొనేందకు సంసిద్ధత, ప్రతిస్పందనపై రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. 

జార్ఖండ్‌లోని రాంచీ, గుజరాత్‌లోని అహ్మదాబాద్, కేరళలోని మలప్పురం తదితర ప్రాంతాలకు నిపుణుల బృందాలను పంపుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిపుణుల బృందాలు మీజిల్స్ వ్యాప్తిని పరిశోధించడంలో రాష్ట్ర ఆరోగ్య అధికారులకు సహాయం చేయనున్నాయి. వ్యాధిని నియంత్రించడానికి సాయం అందించనున్నాయి.

ఇక, మీజిల్స్ అనేది అంటు వ్యాధి. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకితే ఒంటి మీద దద్దుర్లు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎప్పట్నుంచో ఈ వైరస్ ఉనికి మన దేశంలో ఉంది. ఈ వైరస్ సోకకుండా పిల్లలకు రెండు డోసుల వ్యాక్సిన్ వేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios