మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీలు మేజిక్ ఫిగర్‌కు ఒక అడుగు దూరంలో నిలిచిపోవడంతో అక్కడ ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో.. శివరాజ్‌ను మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టడం పెద్ద కష్టమేమి కాదని అందరూ భావించారు.

అయితే కాంగ్రెస్ పార్టీకి బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటిచండంతో మధ్యప్రదేశ్‌‌లో ఉత్కంఠకు తెరపడినట్లయ్యింది. మంగళవారం రాత్రి తుదిఫలితాలు వెల్లడవ్వడానికి ముందు నుంచే కాంగ్రెస్ పెద్దలు మాయవతిని కలిశారు.

యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా మాయవతితో సంప్రదింపులు జరిపారు. ఈ చర్చల ఫలితంగా ఆమె తమ మద్ధతు కాంగ్రెస్‌కేనని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి రాకుండా చేయడమే తమ లక్ష్యమని... అందుకోసం రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయన్నారు.

దీనిలో భాగంగానే మధ్యప్రదేశ్‌లో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు నిమిత్తం కాంగ్రెస్‌కు సహకరిస్తామని తెలిపారు. 203 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో అధికారాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 116. కాంగ్రెస్+ సమాజ్‌వాదీ కలిపి 115, బీజేపీ 109, బీఎస్పీ 2, ఇతరులు 5 చోట్ల విజయం సాధించారు.

మాయావతి మద్ధతుతో కాంగ్రెస్ 117 స్థానాలతో అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు లైన్ క్లియర్ అయ్యింది. తమ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కాంగ్రెస్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను కలవనున్నారు.