కోల్‌కత్తా: దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి పదవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంకా సార్వత్రిక ఎన్నికలు రాకముందే అతడే భావి ప్రధాని అని ఒక పార్టీ కాదు కాదు ఆమెనే ప్రధాని అంటూ మరొక పార్టీ ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసి వేడి రాజేస్తోంది. దీంతో దేశ రాజకీయాల్లో ప్రధాని పదవిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

ఇప్పటికే డీఎంకే  పార్టీ అధినేత స్టాలిన్ ఇటీవలే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అంటూ ప్రకటించేశారు. ఈ ప్రకటన కాస్త దేశ రాజకీయాల్లో అలజడి సృష్టించింది. ఆ తర్వాత ఎస్పీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం తమ ప్రధాని అభ్యర్థి మాయావతి అంటూ ప్రకటించేశారు. 

ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ, ఎస్పీల మధ్య పొత్తుకుదరిన సందర్భంలో అఖిలేష్ యాదవ్ మమతను ప్రధాని అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా మరోసారి ప్రధాని ఎవరు అనే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అఖిలేష్ యాదవ్.  

పశ్చిమబంగాలో ఆ రాష్ట్ర సీఎం టీఎంసీ అధినేత్రి మాయావతి నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకు హాజరైన అఖిలేష్ యాదవ్ దేశ ప్రధానిగా బీఎస్పీ అధినేత్రి మాయావతి లేదా, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అయితే బాగుంటుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

దేశంలో మాయావతి, మమత బెనర్జీ ఇద్దరూ బలమైన నేతలేననీ, మహాకూటమిని నడిపించగల శక్తి వారిలో ఉందని స్పష్టం చేశారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది సమస్య కాదని,  ప్రస్తుతం తమ ముందన్న లక్ష్యం బీజేపీని ఓడించడమేనని ఆ తర్వాత కవర్ చేసుకున్నారు. 

అంతేకాదు దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశానికి కొత్త ప్రధాని కావాలని, సరికొత్త నాయకత్వానికి తమ కూటమి నాంది పలుకుతుందని అఖిలేష్‌ యాదవ్ స్పష్టం చేశారు.