పెళ్లి కావాల్సిన యువతీ, యువకులు తమకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో తెలియజేస్తూ... పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం చూసే ఉంటారు. వధువు కావలెను, వరుడు కావలెను పేరిట ఈ వివరాలు పేపర్లలో యాడ్ రూపంలో కనిపిస్తాయి. ఆ ప్రకటనలో తమ వివరాలు చెబుతూ.. తాము ఎలాంటి అర్హతలు ఉన్నవారు కావాలని అనుకుంటున్నామో తెలియజేస్తారు. 

దాదాపు అందరూ రంగు, చదువు, ఉద్యోగం, కులం లాంటి వాటిని ప్రధానంగా అందులో చెబుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తనకు రూ.10కోట్లు ఆస్తి ఉన్న యువతి వధువుగా కావాలంటూ ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చాలా విచిత్రంగా ఉండటంతో.. నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన కోల్ కత్తాలో చోటుచేసుకుంది.

పశ్చిమబెంగాల్‌లోని సిలిగుడికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. వధువుకు రూ.10 కోట్ల ఆస్తి ఉండాలంటూ షరతు పెట్టి వార్తల్లో నిలిచాడు. సిలిగుడిలోని కాలియాగంజ్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు (42) తనపేరు చెప్పకుండా, అమ్మాయి పేరుమీద రూ.10 కోట్ల ఆస్తి ఉండాలని షరతు పెట్టాడు. ఈ వింత ప్రకటన పాఠకులను ఆకట్టుకుంది. వెంటనే సామాజిక మాధ్యామాల్లో వైరల్‌ అయిపోయింది. దీనికి నెటిజన్లు అనేక మీమ్స్‌ సృష్టించారు. ప్రకటన ఇచ్చింది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయ సంఘం నేతలు స్పష్టంచేశారు.