బెంగళూరు: ప్రియుడితో పారిపోయిన ఓ మహిళ తన భర్తను జైలుకు పంపించాలని కుట్ర చేసింది. ప్రియుడికి నేరచరిత్ర ఉంది. అయితే, ఆణె పథకం బెడిసికొట్టి పోలీసులకు దొరికిపోయింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. 

వైట్ ఫీల్డ్ కు చెందిన కారు డ్రైవర్ (32)తో ఎనిమిదేళ్ల క్రితం ఓ యువతికి వివాహం జరిగింది. వారికి ఐదేళ్ల కూతురు ఉంది. మూడు రోజుల క్రితం కటుంబ సలహా కేంద్రానికి ఫోన్ చేసి తన భర్త వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు చేసింది. చీటీలు నడుపుతున్నాడని, వ్యతిరేకించినందుకు తనను ఇంటి నుంచి గెంటేశాడని ఫిర్యాదు చేసింది. 

దాంతో కుటుంబ సలహా కేంద్రం సభ్యులు అపర్ణ పూర్ణేశ్ ఆమె భర్త ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడారు. దాంతో అసలు విషయం బయటపడింది. కొద్ది రోజుల క్రితం ఆ మహిళ స్నేహితులతో విహార యాత్రకు వెళ్లింది. ఆ సమయంలో వారితో వచ్చిన యువకుడితో పరిచయం పెరిగింది. 

అప్పటి నుంచి వారిద్దరు తరుచుగా ఫోన్ లో మాట్లాడుకునేవారు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. పది రోజుల క్రింద ఆ మహిళ ప్రియుడితో వెళ్లిపోయింది. భార్య కనిపించకపోవడంతో ఆందోళన చెందిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆమె మరో వ్యక్తితో అత్తెబెళలో ఉన్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. దీంతో అపర్ణ ఆ మహిళను తీసుకుని వచ్చి  కౌన్సెలింగ్ ఇచ్చారు. తప్పుడు ఫిర్యాదుతో భర్తను జైలుకు పంపించాలని తానే కట్టకుథ అల్లానని ఆమె అంగీకరించింది. అయితే, ఆమె భర్తతో కాపురం చేయడానికి ఇష్టపడడం లేదు. వారి మధ్య సఖ్యతకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.