ఆమెకు అప్పటికే పెళ్లయ్యింది. మంచి భర్త ఉన్నాడు. ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ.. ఓ మిస్డ్ కాల్ ఆమె జీవితాన్ని తలకిందలు చేసింది. తనకు పెళ్లి కాదని నమ్మించి.. ఓ యువకుడితో పరారయ్యింది. తర్వాత అతనికి నిజం తెలిసింది.. నాకొద్దు పో అన్నాడు. పాత భర్త దగ్గరకు వెళ్లితే అతను కూడా దగ్గరకు రానివ్వలేదు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడులోని నెల్‌లై జిల్లా సేరన్‌ మహాదేవికి చెందిన కూలీ కార్మికుడికి పాళయంకోటై కృష్ణాపురానికి చెందిన బంధువు మహిళకి గత పదేళ్లకు ముందు వివాహం జరిగింది. వీరికి 8 ఏళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. 

కాగా.. సరిగ్గా ఒక్కటిన్నర సంవత్సరాల ముందు ఆ మహిళకి ఓ మిస్డ్‌ కాల్‌ వచ్చింది. కాయత్తార్‌కి చెందిన యువకుడితో పరిచయమై కాలక్రమేణా ప్రేమగా మారింది. ప్రేమ మత్తులో ఉన్న ఆ మహిళ ఆ యువకుడి వద్ద తనకు వివాహం జరిగి పిల్లలు ఉన్నారనే విషయాన్ని దాచిపెట్టింది. 

ప్రియుడిని కలవడానికి వెళ్లినప్పుడు మంగళసూత్రాన్ని తీసేసి బ్యాగులో పెట్టుకుని ఊరు తిరిగింది. 29 ఏళ్ల ఆ మహిళ 24 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకోవడానికి పథకం వేశారు. అనంతరం ప్రియుడిని ఆమె పెళ్లి చేసుకుంది.

భార్య ఏమైందో తెలిక.. భర్త పోలీసులను ఆశ్రయించాడు. వారి దర్యాప్తులో ఆమె మరో పెళ్లి చేసుకున్నట్లు తేలింది. పట్టుకొచ్చి విచారించగా.. ఆమె తాను చేసిన తప్పుని అంగీకరించింది.

దీంతో.. ఆమె ప్రియుడు అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. కాగా.. ఆమె తన భర్త, పిల్లల వద్దకు వెళ్లగా.. వారు కూడా ఛీ కొట్టి వెళ్లిపోయారు. ఇద్దరూ కాదనేసరికి ఆమెను పోలీసులు సమీపంలోని ఓ ఆశ్రమానికి పంపారు.