కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. ఓ ప్రేమోన్మాది ప్రేమ, పెళ్లికి నిరాకరించిందని యువతి తల నరికి హత్య చేశాడు. ఆ తరువాత తలతో పాటు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. 

కర్ణాటక : తనతో ప్రేమ, పెళ్లికి నిరాకరించిందని యువతిపై కక్ష పెంచుకున్నాడు ఓ యువకుడు. ఆ కసితోనే యువతి ప్రాణాలు తీశాడు. ఆమె తల నరికి పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని విజయనగరం జిల్లా కుడ్లిగి తాలూకా కన్నిబొరయ్య హట్టిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భోజరాజు అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్. తన సమీప బంధువైన బసణ్ణ కుమార్తె నిర్మల (21)మీద మనసు పడ్డాడు. ఆమె బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. అయితే, ఆమె దీనికి నిరాకరించింది. ఓసారి వారి ఇంటికి వెళ్లి నిర్మలను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు.

దీనికి నిర్మల కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే భోజరాజుకు 2 నెలల క్రితం మరో యువతితో వివాహం అయ్యింది. పొరుగు జిల్లాలో చదువుకుంటున్న నిర్మల ఇటీవలే స్వగ్రామానికి వచ్చింది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో నిర్మల ఇంటికి వెళ్లిన భోజరాజు ఆమెతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో తనతో తీసుకువెళ్ళిన కత్తితో ఆమె తల నరికి హత్య చేశాడు. ఆ తరువాత తలను బైకుకు ఉంచిన సంచిలో పెట్టుకుని పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. 

మావోయిస్ట్ జోన్ లో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై హత్యాచారం.. గొంతుకోసి, నగ్నంగా మృతదేహం..

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో జూలై 15న ఇలాంటి దారుణ ఘటనే చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది తల్లి, ముగ్గురు కూతుళ్లను కత్తితో దాడి చేశాడు. ప్రేమను నిరాకరించారనే కారణంతో దారుణానికి తెగ బడ్డాడో ప్రేమోన్మాది. కత్తితో ఇంట్లోకి చొరబడి తల్లి, ముగ్గురు కుమార్తెల పై దాడి చేశాడు. అది గమనించిన తల్లి, కుమార్తెలు భయంతో అరుస్తూ ఇంట్లో నుంవి బయటకు పరుగులు పెట్టారు. వీరి కేకలు విని స్థానికులు రావడంతో ప్రేమోన్మాది జోయల్ అక్కడినుంచి పరారయ్యాడు. 

బాధిత యువతి మాట్లాడుతూ.. ‘జోయల్ కొంతకాలంగా మా అక్క వెంటపడుతున్నాడు. ఇష్టపడ్డానని, ప్రేమించమంటూ వేధిస్తున్నాడు. మా అక్క తనకు ఇష్టం లేదని చెప్పింది. మా వాళ్లు కూడా అతడిని మందలించి.. తమకు ఇష్టం లేదని పంపేశారు. దీంతో అతను పగబట్టాడు. 
మా పై కత్తితో దాడి చేశాడు. ముందు ఇంట్లో ఉన్న మా‌చెల్లిని కత్తితో పొడిచాడు. ఇది చూసి కేకలు పెట్టిన మా అక్కపైన కూడా దాడి చేశాడు. భయంతో బయటకు పరుగులు పెడుతున్న నా పైన, మా అమ్మ పైన కూడా కత్తితో దాడి చేశాడు. మా అరుపులు విన్న చుట్టుపక్కలవాళ్లు వచ్చారు. వాళ్లు రావడం చూసిన జోయల్ అక్కడి నుంచి పారిపోయాడు’ అని చెప్పుకొచ్చింది. 

బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ‘మా అమ్మాయిని ప్రేమించానని వచ్చాడు. మేము వద్దన్నాం. దీంతో అది మనసులో పెట్టుకుని ఇంత దారుణానికి తెగబడ్డాడు. ప్రేమను ఒప్పుకోపోతే నరికి చంపేస్తారా?’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నా బిడ్డలకు ఈ పరిస్థితి తెచ్చిన జోయల్ ను వదిలి పెట్టకూడదు అన్నారామె. ఇంట్లో ఉన్న మా అందరి పైనా కత్తితో దాడి చేశాడు. అందరికీ గాయాలయ్యాయి. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. ఏ తల్లికి ఇటువంటి కష్టం రాకుండా చూడాలి..అని ఆమె డిమాండ్ చేసింది.