యువతిని తనవైపు ఆకర్షితురాలు చేసుకునేందుకు ఓ వ్యక్తి గుడ్లగూబను చంపేశాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలోని సుల్తానాపురి ప్రాంతంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..సుల్తానాపురి ప్రాంతానికి చెందిన కన్నయ్య (40) ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతనికి  వివాహం జరిగి భార్య, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.  కాగా.. ఇటీవల అతను అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని చూసి ఇష్టపడ్డాడు. ఆ యువతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. అందుకు ఆ యువతి కూడా తన పట్ల ఆకర్షితురాలు అవ్వాలని అనుకున్నాడు.

అందుకోసం నెట్ లో సెర్చ్ చేయగా.. గుడ్లగూబని చంపితే.. వశీకరణ శక్తులు వస్తాయంటూ ఉన్న  ఓ వీడియో చూశాడు. దానిని అప్లై చేశాడు. ఒక గూడ్లగూబను పట్టుకొని దానిని అతి కిరాతకంగా హత్య చేశాడు.అనంతరం  వశీకరణ శక్తుల కోసం పూజలు చేశాడు.

కాగా.. జంతు సంరక్షణ కేంద్రాన్ని ఈ విషయం తెలియడంతో.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని సోమవారం అరెస్టు చేశారు.