మధ్యప్రదేశ్‌లో ఓ నాటకీయ ఘటన చోటుచేసుకుంది. తన భార్యగా నటించాలని ఓ యువతికి ఆఫర్ ఇచ్చారు. ఆమె తీరా అక్కడికి వెళ్లి భార్యగా నటించింది. కానీ, ఆమెను ఇక వెళ్లొద్దని, తమది నిజమైన పెళ్లి అని చెప్పాడు. దీంతో భార్యగా నటించిన యువతి ఖంగుతిన్నది.
ముంబయి: మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ఏదో సినిమా స్క్రిప్ట్‌లా అనిపించవచ్చు. కానీ, ఇది నిజం. తల్లి దండ్రుల కోసం తనను పెళ్లి చేసుకున్నట్టు, భార్యగా ఇంటిలో ఉన్నట్టు నటించాలని ఓ వ్యక్తి ఆఫర్ చేశాడు. అందుకు రూ. 5 వేలు ఇస్తానని డీల్ చేసుకున్నాడు. ఆ యువతి డీల్ అంగీకరించి వెళ్లింది. గుడిలో ఆ వ్యక్తి తల్లిదండ్రుల ముందు పెళ్లి చేసుకుంది. ఇంటిలో భార్యగా నటించింది. ఈ డ్రామాకు తెరదించాలని, తాను వెళ్లుతానని చెప్పగానే ఆ వ్యక్తి హడలిపోయాడు. తనతోనే ఉండిపోవాలని ప్రాధేయపడ్డాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయకతప్పలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబయికి చెందిన 21 ఏళ్ల యువతి కొన్ని టీవీ సీరియళ్లలో చిన్న చిన్న బిట్ రోల్స్‌లో నటించేది. ఆమెకు ఫ్రెండ్ ఆయేషా భర్త కరణ్ ఓ ఆఫర్ గురించి చెప్పాడు. ఆ యువతిని కరణ్ మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ గ్రామానికి తీసుకెళ్లాడు. ఆ గ్రామ బస్ స్టాండ్ వద్ద కరణ్ ఆ యువతిని ముకేశ్ అనే యువకుడికి పరిచయం చేశాడు. ఆమెను చూడగానే ముకేశ్ ఇష్టపడ్డాడు. ఆ యువతి చేయాల్సిన పనిని స్క్రిప్ట్‌గా చెప్పాడు.
ముకేశ్‌ను ఆ యువతి ఆలయంలో యువకుడి తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ముకేశ్ ఇంటికి వెళ్లింది. హోమ్ మేకర్‌గా నటించింది. ఆరో రోజున ఆమెకు కొన్ని సందేహాలు వచ్చాయి. ఇక ఈ డ్రామాకు తెర దించాలని ఆమె ముకేశ్‌కు చెప్పింది. కానీ, ఆమె వెళ్లడానికి వీల్లేదని ముకేశ్ చెప్పడంతో ఆమె హతాశయురాలైంది. అది నిజమైన పెళ్లి అని, ఆమె కోసం కరణ్‌కు డబ్బులు కూడా చెల్లించినట్టు ముకేశ్ వివరించాడు.
Also Read: ఆ కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్య.. లాడ్జిలో దిగిన తర్వాత నలుగురి బలవన్మరణం.. ఎందుకంటే?
దీంతో ఆ యువతి కరణ్‌కు ఫోన్ చేసింది. కానీ, ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదు. దీంతో తాను ఆ ఫ్యామిలీలో చిక్కుకున్నట్టు భావించిన యువతి గుట్టుగా ముంబయిలోని తన ఫ్రెండ్‌కు కాల్ చేసింది. ఆ ఫ్రెండ్ ముంబయిలోని ధారావి పోలీసు స్టేషన్‌కు సమాచారం చేరవేశారు. ధారావి పోలీసులు మధ్యప్రదేశ్ చేరగానే కరణ్, ముకేశ్ ఎస్కేప్ అయ్యారు.
ముకేశ్ లైంగిక దాడికి పాల్పడ్డాడా? అని పోలీసులు యువతిని అడగ్గా.. అలాంటిదేమీ లేదని యువతి సమాధానం చెప్పింది. ఇప్పుడు ఆ పోలీసులు కరణ్, అయేషాలను గాలిస్తున్నారు.
మన సమాజంలోని లింగ అసమానత కారణంగా ఏర్పడిన సమస్యను ఈ ఘటన ప్రతిబింబిస్తున్నదని సీనియర్ ఇన్‌స్పెక్టర్ విజయ్ ఖండల్గాంకర్ తెలిపారు. లింగ అసమానత కారణంగా పురుషుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని వివరించారు. మధ్యప్రదేశ్‌లో మహిళలను అరేంజ్ చేసే దళారులకు రూ. 50,000 ఇస్తున్నారని పేర్కొన్నారు.
