రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు ప్రకటనలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవలే ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఈవీఎంలను ధ్వంసం చేసిన విషయం మరువకముందే మరోసారి కీలక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జరగనున్నఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మావోయిస్టులు అత్యంత ప్రభావిత ప్రాంతమైన బీజాపుర్‌ జిల్లాలో శుక్రవారం ఈ ప్రకటన విడుదల చేశారు. 

ప్రజలు ఈ ఎన్నికల్లో పాల్గొనవద్దని ప్రతీ పౌరుడు ఈ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ బ్యానర్లు కట్టారు. బీజాపూర్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక్కసారిగా బ్యానర్లు వెలువడటంతో గిరిజనులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే మావోయిస్టులు తమ  ప్రతాపం చూపిస్తున్నారు. ఇటీవలే  ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం భారీగా భధ్రతా దళాలను మోహరించింది. డిసెంబర్‌లో రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం,రాష్ట్రాలతోపాటు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోనూ ఎన్నికలు జరగనున్నాయి. 

అయితే  ఇటీవలే అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీఎమ్మెల్యే సివేరి సోమల హత్యల నేపథ్యంలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించింది ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం. అయినప్పటికీ మావోయిస్టుల బ్యానర్లు వెలువడటంతో ఒక్కసారిగా కలకలం రేపింది.